Sahasra Murder | హైదరాబాద్ : ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్‌లు చూసి.. పక్కాగా ప్లాన్ చేసి.. ఎనిమిదేండ్ల సహస్రను పదో తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఒక్క బ్యాట్ కోసమే ఆ బాలికను చంపినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇవాళ వెల్లడించారు. అయితే సహస్ర హత్యకు కారణమైన బ్యాట్‌ను పోలీసులు మీడియా ముందు ప్రదర్శించారు.
ఇక ఆ బ్యాట్‌పై రెడ్ కలర్ గుర్తులో ఎంఆర్ఎఫ్ అని రాసి ఉంచారు. సహస్ర తమ్ముడు రెగ్యులర్‌గా ఈ బ్యాట్‌తో క్రికెట్ ఆడేవాడని, దాన్ని చోరీ చేయాలనే ఉద్దేశంతోనే సహస్ర ఇంటికి చోరీకి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలిందని సైబరాబాద్ సీపీ తెలిపారు. కిచెన్‌లో ఉన్న బ్యాట్‌ను చోరీ చేసే క్రమంలో చిన్న అలజడి రేగడంతో.. సహస్ర అప్రమత్తమై ఎదురించింది. దీంతో ఆమెను బెడ్రూంలోకి తోసేసి కత్తితో 18 సార్లు పొడిచి చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే ఈ నేరాన్ని అంగీకరించేందుకు నిందితుడు.. రకరకాల కట్టుకథలు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. చివరకు అతని ఇంట్లో ఉన్న రక్తపు మరకలతో కూడిన బట్టలు, కత్తి అతన్ని పట్టించాయి.