మూసాపేట, ఆగస్టు23: కూకట్పల్లి సంగీత్‌నగర్‌లో సహస్ర హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని బాలిక తలిదండ్రులు ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి.. శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి చంపాడని చెప్పడం సరికాదన్నారు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ముంబై జాతీయ రహదారిపై న్యాయ పోరాటానికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని, పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
బాధితుల ఆందోళనతో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎంత నచ్చచెప్పినా.. ఆందోళన విరమించకపోవడంతో సహస్త్ర తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. కాగా, తన కూతురిని చంపిన నిందితుడికి పోలీసులు రక్షణ ఇస్తున్నారని, కూతురిని పోగొట్టుకున్న తమకు రక్షణ లేదని సహస్త్ర తల్లి ఆరోపించింది. ‘నా బిడ్డను చంపిన వాడికి భూమి మీద బతికే హక్కు లేదు’ అని సహస్ర తండ్రి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి క్రిమినల్స్‌ను వదిలేస్తే మాలాంటి తల్లిదండ్రులను ఎంతో మందిని ఏడుపిస్తాడన్నారు. పోలీసులే మాకు న్యాయం చేయాలన్నారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా శిక్షించాలన్నారు. కాగా, సహస్ర కుటుంబ సభ్యులను ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ శనివారం పరామర్శించారు.