సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రైతు బజార్లలో ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం 14 కూరగాయల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు ఆహార భద్రతా ప్రమాణాల నమోదు, లైసెన్సింగ్ శిబిరాలు నిర్వహించారు.కూరగాయల వ్యాపారులకు ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్, లైసెన్స్లు జారీ చేయడంతో పాటు ఆహార పరిశుభ్రత, భద్రతా నిబంధనలు, మార్కెట్ ప్రాంగణాల్లో శానిటేషన్ నిర్వహణపై వ్యాపారులకు అవగాహన కల్పించారు.
ఈ శిబిరాలు కుషాయిగూడ, ఉప్పల్ వెజిటేబుల్-ఫ్రూట్ మార్కెట్, సరూర్నగర్ రైతు బజార్, ఎన్టీఆర్ నగర్ మార్కెట్, వనస్థలిపురం, మాదన్నపేట, మీర్ ఆలం మండి, ఓవైసీ మార్కెట్, మోండా మార్కెట్, మెట్టుగూడ, ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్, గుడి మల్కాపూర్, లింగంపల్లి, జేఎన్టీయూ రైతు బజార్లలో నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారుల ప్రకారం 926 మంది వ్యాపారులు రిజిస్ట్రేషన్, లైసెన్స్లు దరఖాస్తులు చేసుకున్నట్లు చెప్పారు. ఈ మార్కెట్లలో 30వ తేదీన మరో విడత అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.