Osmania University | సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రివి అయి ఉండి విద్యా శాఖను కూడా చూస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి స్వేచ్ఛగా పోలేరా మీరు అని నిలదీశారు. యూనివర్సిటీలో అప్రకటిత కర్ఫ్యూ విధిస్తారా?విద్యార్థుల హక్కులను కాలరాస్తారా? అని మండిపడ్డారు.
ఇనుప కంచెలు,బ్యారికేడ్లు లేని ప్రజాపాలన అన్నారు.. మరి ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని వాటితో పాటు బెటాలియన్ల కొద్దీ పోలీసులతో ఎందుకు మోహరించారు అని ముఖ్యమంత్రిని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో శంకుస్థాపనలు చేసి నిర్మించిన వాటిని ప్రారంభించడం అంటే.. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగం పొందిన వారికి నియామక పత్రాలు ఇచ్చినట్లే అని యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు.. 22 నెలల్లో అందులో రెండు శాతం కూడా ఉద్యోగాలు ఇవ్వలేరని విమర్శించారు.
నిరుద్యోగ భృతి,విద్యార్థినిలకు స్కూటీ లు ఎక్కడ అని విద్యార్థులు, యువతీయువకులు అడుగుతారని యూనివర్సిటీని పోలీసు సిటీ గా మార్చారా సీఎం గారు అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు రాక విద్యార్థులు పడుతున్న బాధలు ఇనుప కంచెలు పెడితే తొలిగిపోతాయా అని నిలదీశారు. బయట ప్రపంచానికి తెలియకుండా పోతాయా సీఎం గారు అని ప్రశ్నించారు ఇది ప్రజా పాలన కాదు.. ఎమర్జెన్సీ పాలన అని వ్యాఖ్యానించారు. నిషేధాలతో, ఆంక్షలతో, అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు రూ.283 కోట్లతో విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం భవనాలు నిర్మించామని, వాటిని మీరు ఇప్పుడు ప్రారంభించటానికి వెళ్తున్నారని అన్నారు.
@TelanganaCMO,@revanth_anumula
ముఖ్యమంత్రివి అయి ఉండి విద్యా శాఖను కూడా చూస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి స్వేచ్ఛగా పోలేరా మీరు… అప్రకటిత కర్ఫ్యూ విధిస్తారా?విద్యార్థుల హక్కులను కాలరాస్తారా?ఇనుప కంచెలు,బ్యారికేడ్లు లేని ప్రజాపాలన అన్నారు…..మరి ఈ రోజు ఉస్మానియా… pic.twitter.com/mRWgsrfNsm
— Sabitha Reddy (@BrsSabithaIndra) August 25, 2025