బడంగ్పేట్, ఫిబ్రవరి 20: ఎస్ఎన్డీపీ నాలా పనులను వెంటనే పూర్తిచేయించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ, బడంగ్పేట్ సర్కిల్ డీసీ సరస్వతి, ఎస్ఈ డీ కిష్టప్ప, డీఈ సౌమస్య, డీఈ వెంకన్న, ఏఈ హరీష్, ఎన్ఎడీపీ ఈఈ వరలక్ష్మి, డీఈ అనురాధతో శుక్రవారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
గతంలో జరిగిన ఎస్ఎన్డీపీ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎన్డీపీ ఫేజ్-1 నాలా పనులు ఎంతవరకు పూర్తిచేశారని ఆరా తీశారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. చెరువులకు సంబంధించిన లింక్‌లను కలుపుతూ నాలా పనులు చేయించాలన్నారు. ఎస్ఎన్డీపీ ఫేజ్-2 పనులు ఎంతవరకు వచ్చాయన్నారు. సున్నం చెరువు నుంచి మాసం చెరువు వరకు ఎస్ఎన్డీపీ నాలా నులు
చేపట్టాలన్నారు.
గ్రీన్ హోమ్స్ కాలనీలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. అల్మాస్గూడ స్వేచ్ఛ నివాస్ నుంచి ఎర్రకుంట వరకు చేయవలసిన నాలా పనులు నిలిచిపోయినట్లు ఆమె గుర్తు చేశారు. సుమా ప్యారడైజ్ నుంచి పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ వరకు నాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వర్షాకాలం రాకముందే పనులు పూర్తిచేయించాలని అధికారులకు సూచించారు. మీర్పేట్లో పెద్ద చెరువు నుంచి మంత్రాల చెరువు మధ్యలో ఆగిపోయిన నాలా లింక్‌ను సరిచేయాలన్నారు. ప్రొటోకాల్ విషయంలో అధికారులు నిబంధనలు పాటించాలన్నారు. మీర్పేట్ త్రివేణినగర్‌లో డ్రైనేజీ సమస్యను బీఆర్ఎస్ నాయకుడు భూపేష్ గౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆమె డ్రైనేజీని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో అధికారులతో ఎస్ఎన్డీపీ నాలా పనుల పై సమీక్షా సమావేశం పెడితే కాంగ్రెస్ నాయకులు వచ్చి అర్ధరహిత ఆరోపణలు చేడయం పట్ల బీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, అర్కల కామేష్ రెడ్డి మండిపడ్డారు. సమీక్షా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎవరూ లేదరన్నారు. తెలియకుండనే తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని వారు హెచ్చరించారు. ఏ హోదాతో కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనులు చేస్తున్నారో చెప్పాలన్నారు. కేఎల్ఆర్ ఏ హోదాతో వచ్చి అధికారులతో కలిసి కాలనీలలో సమావేశాలు పెట్టి అధికారులకు ఆదేశాలు ఇస్తారని వారు అన్నారు. ఇది మంచి పద్ధ్దతి కాదన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్త్తూ ఊరుకోమన్నారు.