సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల జరిపిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఆర్వీ కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమితులయ్యారు. బదిలీపై వెళుతున్న కమిషనర్ ఇలంబర్తి నుంచి కర్ణన్ అధికారికంగా జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.
అంతకు ముందు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా సేవలందించిన ఆర్వీ కర్ణన్ హైజీన్ ప్రమాణాలను ఉల్లంఘించిన రెస్టారెంట్లు, పబ్లు, ఐఎస్ క్రీమ్ పార్లర్లు వంటి ఆహార సంస్థలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి ప్రజల్లో ఆహార భద్రతపై అవగాహన పెంచారు.
జీహెచ్ఎంసీ కమిషనర్గా కొనసాగిన ఇలంబర్తి తన పదవీ కాలంలో నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పౌర సేవల మెరుగుదలకు పలు కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఆయన పురపాలక శాఖ కార్యదర్శి (హెచ్ఎండీఏ పరిధి)గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్, బదిలీపై వెళ్లిన ఇరువురికి ఉద్యోగులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.