బడంగ్‌పేట, ఆగస్టు 26: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల గోల్మాల్ జరుగుతోందంటూ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఎవరికి చెబితే వారికే టెండర్ ఒకే అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలో.. క్రేన్లకు, వాటర్, లైట్లు, బ్యానర్లు, గజ ఈతగాళ్లు, జెండాలు తదితర వాటికి అధికారులు టెండర్లు వేశారు. ఐదు లక్షలకు ఒక టెండర్ కాల్ పర్ చేశారు.
కార్పొరేషన్ పరిధిలోని నాలుగు చెరువుల దగ్గర నాలుగు క్రేన్లను ఏర్పాటు చేయడానికి టెండర్ ప్రక్రియ మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారం ఎక్కువ లెస్‌కు ఏ కాంట్రాక్టర్ అయితే టెండర్ వేస్తాడో అదే కాంట్రాక్టర్‌కు టెండర్ తీయవలసి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా అధికారులు టెండర్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు కొంతమంది కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 35 శాతం, 27 శాతం, 21 శాతం టెండర్ వేసిన వారికి ఇవ్వకుండా కేవలం 6శాతం లెస్ వేసిన కాంట్రాక్టర్‌కు టెండర్ ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గత అధికారుల తప్పిదాలను రిపీట్ చేస్తున్న వైనం..
టెండర్ విధానంలో జరుగుతున్న అవకతవకలపై కాంట్రాక్టర్ ప్రవీణ్.. జిల్లా కలెక్టర్, సీడీఎంఏకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగ, గతంలో ఇలాంటి తప్పిదాలే చేసిన ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఇలీవల వచ్చిన అధికారులు కూడా అలాగే వ్యవహరిస్తుండటం పట్ల కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం మీర్‌పేట నుంచి ఇటీవల బదిలీపై వచ్చిన డీఈ అనేక తప్పిదాలు చేసిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు పోస్టింగ్ రావడానికి సహకరించిన ఓ కాంగ్రెస్ నేతకు ఆయన ఇంట్లో కూర్చోని 14 పనులకు సంబంధించి రాత్రికి రాత్రే టెండర్ తీశారన్న ఆరోపణలు ఉన్నాయి. పదవుల్లో లేకపోయినా మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన నాయకులే చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు ఎంత తక్కువ లెస్‌కు వేసినా టెండర్లు వారికే దక్కడంతో పాటు పనులు పూర్తి కాకపోయినా బిల్లులు కూడా వారికే ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అసోసియేషన్‌గా ఏర్పడిన కాంట్రాక్టర్లు..
చిన్నా చితక కాంట్రాక్టర్లను అసలే పట్టించుకోకపోవడంతో కొంతమంది కలిసి కొత్తగా కాంట్రాక్టర్ల అసోసియోషన్ ఏర్పాటు చేసుకున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మున్సిపల్ అధికారులు పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రతీది ఐదులక్షల వరకే టెండర్లు పెట్టడం పై కాంట్రాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లో టెండర్లలో జరుగుతున్న అవకతవకలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆందోళన కార్యమ్రమాలు చేపడుతామని కొంత మంది కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.