సిటీబ్యూరో, జనవరి 27 ( నమస్తే తెలంగాణ ) : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చి..అధికారంలోకి వచ్చాక మోసం చేసిన సర్కార్కు బుద్ధి చెబుతామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు సోమవారం బస్సు భవన్లో అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. కార్మికులను భవన్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కార్మిక నాయకులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమైనా ఉగ్రవాదులమా అంటూ ప్రశ్నించారు.
తమ హక్కుల సాధనకు ఉద్యమిస్తున్నామని తమను ఉగ్రవాదులగా చూడొద్దని హితవు పలికారు. 21 డిమాండ్లతో ప్రభుత్వం ముందు ఉంచామని.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కాగా, గ్రేటర్లోని పలు బసు డిపోల నుంచి కార్మికులు అధిక సంఖ్యలో బస్సు భవన్ వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రయివేటీకరణ చేయడంలో భాగంగా సర్కార్ ఆలోచనలు ఉన్నాయని ఆరోపించారు. ఎలాంటి విచారణలు జరపకుండానే కార్మికులను సప్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈయూ, ఎన్ఎంయూ, బీకేయూ, బీడబ్ల్యూయూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.