TGS RTC | సిటీబ్యూరో, మార్చి 29 ( నమస్తే తెలంగాణ ) : దిల్సుఖ్నగర్ నుంచి సూర్యపేటకు ఎక్స్‌ప్రెస్ బస్సు టికెట్ ధర రూ. 200లు ఉంటుంది. అయితే పండుగ దృష్ట్యా ఆ ధరను 290కి పెంచారు. పెంచితే పెంచారేమో గానీ అది నిజంగానే ఎక్స్‌ప్రెస్ బస్సు అయితే ప్రయాణికులు కొంత అంగీకరించేవారేమో.
కానీ నగరంలో తిరుగుతున్న సిటీ బస్సును పండుగ పూట ఎక్స్‌ప్రెస్ అంటూ బోర్డు తగిలించి ఎక్స్‌ప్రెస్ బస్సు ధరలకు మించి డబ్బులు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేందని అడిగితే బస్సు దిగిపో అని కండక్టర్లు బెదిరిస్తున్నారని రవి అనే ప్రయాణికుడు చెప్పాడు.
బస్సులు పెంచకుండా ..!
గ్రేటర్ ప్రయాణికులకే ఇక్కడ నడిచే బస్సులు సరిపోవడం లేదు. సాధారణంగా గ్రేటర్లో ఉచిత బస్సు అమలుకు ముందున రోజుకు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవాళ్లు. ఇందులో మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది ఉండేవాళ్లు. కానీ మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు రోజుకు సుమారు 24 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు.
ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండటం విశేషం. ఒక్క రోజుకు ఇంత మంది ప్రయాణం కేవలం గ్రేటర్లో ఉన్న 2600 బస్సులపైనే ఆధారపడి ఉంది. దీంతో ప్రతీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ సిటీ బస్సులను జిల్లాలకు ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో తిప్పడంపై విమర్శలు వస్తున్నాయి.