Hyderabad | సిటీబ్యూరో, జూన్ 21 ( నమస్తే తెలంగాణ) : అది ఖైరతాబాద్ ఆర్టీఏ ప్రధాన కార్యాలయం. కమిషనర్, జేటీసీ ఉన్నతాధికారులు ఉంటారు. ఆ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్టీఏ సిబ్బందిమంటూ.. కొందరు వ్యక్తులు వాహనాలను ఆపి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. నేమ్ ప్లేట్ లేని.. యూనిఫాం ధరించి తనిఖీ అధికారి పర్యవేక్షణ కూడా లేకుండా ఇష్టానుసారంగా వాహనాలు ఆపి.. పత్రాలు లేని వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా నెలలో ఐదారుసార్లు వసూళ్లకు పాల్పడుతున్నారని..ఏ రోజూ కూడా పర్యవేక్షించాల్సిన మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, ఆర్టీఓ కనిపించరని వాపోతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు రాసే అధికారి అక్కడ లేకపోవడం గమనార్హం. ఆర్టీఏ నిబంధనల ప్రకారం ఎంవీఐ, ఆర్టీఓ స్థాయి అధికారి లేకుండా వాహన తనిఖీలు చేయకూడదు. అందులోనూ తనిఖీ బృందానికి యూనిఫాంతో పాటు నేమ్ ప్లేట్స్ ఉండాల్సిందే. కానీ నేమ్ ప్లేట్ లేకుండా తనిఖీ అధికారి లేకుండా వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా వసూళ్లు చేసిన సొమ్ము ఎవరి జేబులోకి వెళ్తుంది? తనిఖీలు చేస్తున్న వారు నిజంగానే ఆర్టీఏ సిబ్బందేనా? నెల రోజుల్లో వివిధ రకాల వాహనాల యజమానుల నుంచి సుమారు వేలాది రూపాయలు వసూలు చేశారని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో దళారులు ఆడిందే ఆటగా మారింది. ఫైల్‌కు ఇంత అంటూ కొందరి అధికారులతో ఒప్పందం కుదుర్చుకొని పనులు కానిస్తున్నారు. అమాయకులను ఆశ్రయించి దళారులు వారి వద్ద నుంచి డబ్బులు గుంజీ పనులు చేయిస్తున్నారని ఓ మహిళ తెలిపారు. నిర్ణీత సమయంలోపు కావాల్సిన పనులను కూడా అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారు. దళారులను ఆశ్రయిస్తే మాత్రం పనులు త్వరితగతిన పూర్తవుతాయనేలా పరిస్థితులు ఖైరతాబాద్ కార్యాలయంలో ఉన్నాయని చెప్పారు.
ఇటీవల ఓ వ్యక్తి కారు రిజిస్ట్రేషన్‌కు వెళ్తే డాక్యుమెంట్లు సరిగా లేవని ఇబ్బంది పెట్టారు. ఆ వ్యక్తి అక్కడే ఉన్న ఓ దళారిని కలిసి విషయం వివరించగా, అతడు రూ.2వేలు డిమాండ్ చేశాడని.. అప్పగించి పని పూర్తి చేసుకున్నానని వివరించాడు. కార్యాలయ పనివేళలు ముగిసిన అనంతరం దళారులంతా వందలాది దరఖాస్తులు పట్టుకుని ఖైరతాబాద్ కార్యాలయంలో పనులు చేయిస్తుంటారు. పనివేళలు కాకున్నా.. వారికి ద్వారాలు తెరుస్తారు ఆర్టీఏ సిబ్బంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.