హైదరాబాద్: కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ(RTA Checkings) అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంతోపాటు శివార్లలో విస్తృతంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్, బీమా, ఫిట్నెస్, పర్మిట్ పత్రాలు, బస్సు లోపల భద్రతను పరిశీలిస్తున్నారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.
రాజేంద్రనగర్, ఎల్బీనగర్ చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదుచేశారు. చింతలకుంట వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. మరో నాలుగు బస్సులపై కేసులు నమోదుచేశారు.

మరోవైపు.. శుక్రవారం రాత్రి హయత్‌నగర్, ఎల్బీనగర్, కూకట్పల్లి పరిధిలో కూడా ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాహనాలపై ఉన్న చలాన్లను వసూలు చేశారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కూడా దుర్మరణం చెందాడు.