సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఆర్టీఏ అధికారుల అసోసియేషన్ నుంచి ఈ చాలన్ అంటూ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. అందులో .ఏపీకే ఫైల్స్‌ను పంపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్‌నేరగాళ్లు . ఒక పక్క ట్రాఫిక్ చాలన్ల పేరుతో మాయం చేస్తుంటే.. మరో పక్క ఆర్టీఏ – ఈ చాలన్ పేరుతో మరో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. తమకు చాలన్ వచ్చిందనే ఆలోచనతో ఒకరు.. ఆర్టీఏ అధికారుల అసోసియేషన్ పంపించిందనే ఆలోచనతో మరొకరు.. ఇలా ఆయా గ్రూప్‌లో వచ్చే ఫైల్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. .ఏపీకే ఫైల్స్ కావడంతో అందులో సైబర్‌నేరగాళ్లు వైరస్లు పంపిస్తూ.. క్లిక్ చేయడంతోనే అందులో ఉండే వైరస్ సెల్ఫోన్లు, కంప్యూటర్లోకి వెళ్తుంది.
ఆ తరువాత సైబర్‌నేరగాళ్లు తయారు చేసిన ఆయా వైరస్‌లతో కూడిన సాఫ్ట్వేర్లు సెల్ఫోన్లు హ్యాక్ అవుతూ, ఆ తరువాత దాని ఆపరేటింగ్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆయా స్కీమ్‌లు, ప్రభుత్వ విభాగాల అధికారుల అసోసియేషన్ల పేర్లు, ప్రధాన మంత్రి పేరుతో ఉండే స్కీమ్‌లు ఇలా ఆయా స్కీమ్‌ల పేరుతో అమాయకులను సైబర్‌నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఆర్టీఏ-ఈచాలన్ల పేరుతో .ఏపీకే ఫైల్స్‌ను పంపిస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలు దోచేస్తున్నారు. సోమవారం రాచకొండ పరిధిలోని ఆటోనగర్‌లో నివాసముండే ట్రాన్స్‌ఫోర్టు వ్యాపారికి ఆర్టీఓ యాప్ పేరుతో ఒక లింక్‌ను పంపించారు. అందులో ఆర్టీఏ-ఈచాలన్ ఉందంటూ సూచిస్తూ .ఏపీకే ఫైల్ పంపించి అతని ఖాతాలో నుంచి రూ. 1.5 లక్షలు కాజేశారు.
తాజాగా మంగళవారం చైతన్యపురిలో నివాసముండే వ్యాపారి ఫోన్ నంబర్‌ను ‘ఆర్టీఓ ఏఐఎఫ్ఎంవీడీ’(ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మోటర్ వెహికల్ డిపార్టుమెంట్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్) పేరుతో ఉన్న గ్రూప్‌లో బాధితుడి నంబర్‌ను యాడ్ చేశారు. ఆ తరువాత ఆర్టీఓ-ఈ చాలన్.ఏపీకే ఫైల్‌ను పంపించారు. దానిని చూసిన బాధితుడు ఆర్టీఓకు సంబంధించిందెదో మెసేజ్ వచ్చిందని భావించి ఆ ఫైల్‌ను క్లిక్ చేశాడు. ఆ తరువాత నిమిషాల వ్యవధిలోనే అతని బ్యాంకు ఖాతాల నుంచి ఆరు దఫాలుగా రూ.1.5 లక్షలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు వెంటనే హెచ్డీఎఫ్సీ కస్టమర్ కేర్, ఆ తరువాత సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.