HMDA | సిటీబ్యూరో, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): కోకాపేట నియోపోలిస్ లే అవుట్ తరహాలో బుద్వేల్ లే అవుట్‌ను అభివృద్ధి చేసే పనులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఔటర్ రింగు రోడ్డు వెళ్లే మార్గంలో ఉన్న బుద్వేల్ లే అవుట్‌ను సుమారు 182 ఎకరాల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. ఈ లే అవుట్‌ను పూర్తిగా బహుళ అంతస్తు భవనాలు ( మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్-ఎంఎస్బీ) నిర్మించేలా లే అవుట్‌కు డిజైన్ చేశారు. 100, 120 అడుగుల విస్తీర్ణంతో కూడిన రోడ్లను నిర్మించడం ద్వారా 10 – 60 అంతస్తుల వరకు ఆకాశ హర్మ్యాలను నిర్మించేందుకు వీలుగా అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇందుకు రూ.354 కోట్ల అంచనా టెండర్లు పిలిచిన హెచ్ఎండీఏ ఆ ప్రక్రియను ఇటీవలే పూర్తి ఎన్సీసీ(నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ) లిమిటెడ్ సంస్థకు నిర్మాణం పనులను అప్పగించింది. గతంలో ఇదే సంస్థ ఐటీ కారిడార్‌లోని కోకాపేట నియో పోలీస్ లే అవుట్‌ను సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతంగా అభివృద్ధి చేసింది. తాజాగా బుద్వేల్ హెచ్ఎండీఏ లే అవుట్‌ను సైతం అదే స్థాయిలో ఐటీ కంపెనీలు, భారీ నివాస గేటెడ్ కమ్యూనిటీ నివాసాలు ఉండేలా ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా మార్చి ఆన్లైన్ వేలంలో విక్రయించారు. మొత్తం 182 ఎకరాలను 17 ప్లాట్లుగా చేసి అందులో 14 ప్లాట్లను మాత్రమే వేలం ద్వారా విక్రయించింది.
ఔటర్తో అనుసంధానం..
బుద్వేల్‌లో 182 ఎకరాల్లో చేపట్టిన హెచ్ఎండీఏ లేఅవుట్ ఔటర్ రింగు రోడ్డును అనుకొని ఉంది. అదే విధంగా అటు ఐటీ కారిడార్ వైపు, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లేందుకు వీలుగా లేఅవుట్లోని ప్రధాన రహదారి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు అనుసంధానం చేసేలా లేఅవుట్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం లేఅవుట్లోకి వెళ్లేందుకు ప్రధాన రహదారి రాజేంద్రనగర్ నుంచి ఉన్న హిమాయత్‌సాగర్ వరకు రేడియల్ రోడ్డు మీదుగా మానస హిల్స్ పక్క నుంచి రోడ్డు మార్గం ఉంది. భారీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు వచ్చే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా విశాలమైన రోడ్లను అటు ఓఆర్ఆర్ వైపు, ఇటు రాజేంద్రనగర్ – బుద్వేల్ రేడియల్ రోడ్డు వైపు రోడ్లను నిర్మించనున్నారు. రోడ్లతో పాటు మంచినీరు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, ల్యాండ్ స్కేపింగ్ వంటి మౌలిక వసతులను ఈ లే అవుట్లో కల్పించనున్నారు. ఈ లే అవుట్ సముద్ర మట్టానికి 550 నుంచి 590 అడుగుల ఎత్తులో ఉంది. అదే విధంగా జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌కు సమీపంలోనే ఉండటంతో అద్భుతమైన వ్యూ ఈ లే అవుట్ మీదుగా ఉంది. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హెచ్ఎండీఏ అధికారులు మౌలిక వసతులను కల్పిస్తున్నారు.