ఎల్బీనగర్/ ఆర్కేపురం, ఆగస్టు 14 : విశ్వనగరంగా అన్ని రంగాల్లో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి సాధిస్తున్నదని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం సరూర్‌నగర్ డివిజన్ విజయపురి కాలనీలో రూ.5.98 కోట్లతో చేపట్టిన ట్రంకులైన్ నిర్మాణ పనులు, రూ.31 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, నగర డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని ఆర్కేపురం, కొత్తపేట డివిజన్ల పరిధిలో రూ. 1.50 కోట్లతో చేపట్టిన ట్రంకులైన్ పనులకు మోహన్‌నగర్‌లో ఎమ్మెల్యే, మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. 9 ఏండ్ల క్రితం ఎల్బీనగర్ ప్రాంతం ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా మారిందో చూస్తేనే నగర అభివృద్ధి తెలుస్తున్నదని పేర్కొన్నారు. అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధితో ఎల్బీనగర్లో జంక్షన్ల రూపురేఖలు మారిపోయాయన్నారు. మెట్రో విస్తరణతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, శివారు ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుందన్నారు. నాలాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని, దీంతో వరదనీరు సాఫీగా పోతుందన్నారు. ఒక ప్రత్యేకమైన విజన్‌తో తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, కార్పొరేటర్ పవన్‌కుమార్, మాజీ కార్పొరేటర్ సాగర్‌రెడ్డి, అనితా దయాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాహుల్‌గౌడ్, మహేందర్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.