సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): విలువైన గిఫ్ట్‌లంటూ కొందరు.. కస్టమ్స్ అధికారులమంటూ ఇంకొందరు.. స్నేహం, ప్రేమ, పెండ్లి పేరుతో మోసం చేసే సైబర్ నేరగాళ్లు కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్నట్లే ఉండి తిరిగి ఈ తరహా నేరాలను ప్రారంభించారు. ఎప్పటికప్పుడు రూట్ మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ట్రేడింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలంటూ నిండా ముంచుతున్నారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మ్యాట్రీమోనీ సైట్లు, డేటింగ్ యాప్‌లలో పరిచయాలు పెంచుకుంటూ స్నేహానికి గుర్తుగా అమెరికా, లండన్ నుంచి లక్షల విలువైన వస్తువులు పంపిస్తున్నామంటూ నమ్మిస్తుంటారు. ఒకటి రెండు రోజుల తరువాత నేరగాళ్లే ఫోన్ చేస్తారు. ‘మీ పేరుపై పార్సిల్ వచ్చిందని.. అందులో విలువైన వస్తువులున్నాయి.. దానికి కస్టమ్స్ డ్యూటీ, కొరియర్ సర్వీస్‌లు చెల్లించలేదు.’ అంటూ బాధితులను ట్రాప్‌లోకి దింపుతారు. ఆ తరువాత వివిధ రకాలైన క్లియరెన్స్‌లు కావాలంటూ నమ్మిస్తారు. అందినకాడికి దోచేస్తారు. ఈ తరహా మోసాలతో అనేక మంది కోట్లు పోగొట్టుకున్నారు.
ఇన్‌స్టాలో రీల్స్ చూస్తుండగా..
రామంతాపూర్‌కు చెందిన 21 ఏండ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా ఫ్రెండ్చాట్ (డేటింగ్ యాప్)ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో డాక్టర్ రెడీ ఆమ్‌స్ట్రాంగ్ పేరుతో ఉన్న ఒక వ్యక్తితో చాటింగ్ చేశాడు. ఒకటి రెండు రోజుల తరువాత ఇద్దరు వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ స్నేహితులుగా మారారు. ఈ స్నేహానికి గుర్తుగా మంచి గిఫ్ట్ బాక్స్ పంపిస్తున్నానని.. ఇందులో ఐఫోన్, వాచ్, ల్యాప్‌టాప్, ట్యాబ్, దస్తులు, 240,000 అమెరికన్ డాలర్లు ఉంటాయన్నారు.
అంతటితో ఆగక నేను కూడా ఇండియాకు వస్తున్నా అని చెప్పడంతో ఫ్లైట్ టికెట్లు పంపించాడు. అతడి మాటలు నిజమని నమ్మిన యువకుడు ఆ వస్తువులు వస్తాయనే భ్రమలో ఉన్నాడు. మూడు రోజుల తరువాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి తమకు కొన్ని పార్సిల్ వచ్చాయని తాను కొరియర్ కస్టమర్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాంటూ ఒక మహిళ మాట్లాడింది.
ఆ పార్సిల్ స్కాన్ చేస్తే డాలర్లు, ఐ ఫోన్, ల్యాప్‌టాప్ తదితర వస్తువులున్నాయని అందుకు సంబంధించిన ఛార్జీలు చెల్లించాలంటూ నమ్మించారు. డీడీ తీసి పంపొచ్చని.. లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయవచ్చంటూ బ్యాంకు ఖాతాలు పంపింది. వివిధ ఛార్జీల పేరుతో బాధితుడి నుంచి రూ. 7,22,500 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బులు అడగడంతో ఇది మోసమని గ్రహించి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్ట్‌టైమ్ జాబ్ అంటూ రూ. 5 లక్షలు బురిడీ
సిటీబ్యూరో, జులై 27 (నమస్తే తెలంగాణ): ఎన్ఎస్ఈ నుంచి సర్కార్ 301 పేరుతో పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్స్ ఉన్నాయంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు రూ. 5 లక్షలు మోసం చేశారు. న్యూనాగోల్కు చెందిన బాధితురాలు ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె వాట్సాప్‌కు ఎన్ఎస్ఈ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి సర్కార్ 301 పేరుతో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఆఫర్ చేస్తోందని నమ్మించారు. మీ నెంబర్‌ను టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేస్తున్నామంటూ చెప్పి యాడ్ చేశారు. రోజు 21 టాస్క్లుం టాయని, ఉద్యోగమంతా గూగుల్ రివ్యూస్ రాయడంతోనే ఉంటుందంటూ చెప్పారు.
మొదట ఒకటి, రెండు టాస్క్‌లకు రూ. 210లు లాభం వచ్చిందని బాధితురాలికి ఆ డబ్బును పంపించారు. మీరు డబ్బు వెచ్చించి టాస్క్‌లు తీసుకుంటే ఎక్కువ మొత్తంలో లాభాలు సంపాదించవచ్చంటూ నమ్మించారు. ఇలా మొదట తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టగానే కొంత లాభాలు చూపించారు. ఆ తరువాత దఫ దఫాలుగా 14 సార్లు రూ. 5.07 లక్షలు నేరగాళ్లు సూచించిన ఖాతాలోకి డిపాజిట్ చేశారు. మీకు డబ్బు భారీగా జమ అవుతుందని ఒకేసారి డబ్బంతా వస్తుందని, ఫైనాన్స్ డిపార్టుమెంట్ చూస్తుందంటూ కాలయాపన చేస్తుండడంతో బాధితురాలికి అనుమానం వచ్చి ఆరా తీసింది. మోసమని గుర్తించి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.