సిటీబ్యూరో/నాచారం, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఇన్‌స్టాగ్రామ్‌లో ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తూ అమాయక ప్రజలను కొందరు వ్యాపారులు గందరగోళానికి గురిచేస్తున్నారు. రూ. 26 వేలకే కారు విక్రయిస్తున్నట్లు సోషల్‌మీడియాలో ప్రకటన చూసిన సామాన్య ప్రజలు నాచారానికి భారీగా తరలొచ్చారు. గతేడాది ఉప్పల్‌లో బట్టతల ఉన్న వారికి రూ.వెయ్యికే మూడు నెలల్లో జుట్టు తెప్పిస్తానంటూ ఇచ్చిన ప్రకటన మాదిరిగానే తీవ్ర గందరగోళం సృష్టించింది.
నాచారం ప్రాంతంలో ట్రస్ట్ కార్ నిర్వాహకులు రోషన్ గత కొన్నేండ్లుగా సెకెండ్ హ్యాండ్ కార్ సేల్స్ వ్యాపారం చేస్తున్నాడు. అదే ప్రాంతంలో మరో సెకెండ్ హ్యాండ్ సేల్స్ అడ్డాను జనవరి 26న ఓపెన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా రూ. 26 వేలకే కారు విక్రయిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. తక్కువ ధరకు కారు వస్తుందని, ఆ కారు ఎలా ఉంటుంది… ఎందుకంత తక్కువకు వస్తుందనే ఆలోచన చేయకుండా వందలాది మంది అక్కడకు చేరుకున్నారు. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా 26వ తేదీన తన సెకెండ్ సేల్స్ అడ్డాను ప్రారంభిస్తుండడంతో కొన్ని కార్లను రూ. 26 వేలకు అమ్మాలని నిర్ణయించుకున్నాని నిర్వాహకుడు చెప్పారు.
అమ్మడానికి సుమారు 20 కార్ల వరకు మాత్రమే ఉన్నాయి.. అక్కడకు వచ్చిన వారు వందల సంఖ్యలో ఉన్నారు.. తమకు కావాలంటే .. తమకు కావాలంటూ గుంపులుగా చేరడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వచ్చిన జనాలను చూసి ఖంగుతిన్న నిర్వాహకుడు చేతులెత్తేశాడు, ఇంతలో అక్కడకు వచ్చినవారు తమను మోసం చేస్తారా? అంటూ అక్కడున్న కార్లపై రాళ్లు విసురుతూ ఆందోళనకు దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు, తమను మోసం చేశాడంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంత తక్కువకు కార్లు ఎలా వస్తున్నాయంటే.. 15 నుంచి 20 సంవత్సరాలు వాడిన పాత తరం కార్ల గడువు తీరడంతో… వాటిని తక్కువ ధరకు కొని… నిర్వాహకులు కొద్ది లాభంతో కార్లను విక్రయించేందుకు ఈ ప్రకటనలు ఇచ్చారు. అయితే తమ వ్యాపారం పెంచుకోవడం కోసం ఇదో రకమైన వ్యాపార ఎత్తుగడ కావడం గమనార్హం.

Cars
గతంలో ఉప్పల్‌లో..
ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో శరవేగంగా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తామని ఒక ప్రకటన చేశాడు. దానిని చూసిన సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాకు చెందిన హరీష్ దీనికి తాను ప్రాంఛైస్ తీసుకోవాలని భావించాడు. సల్మాన్‌తో మాట్లాడాడు. ఇందులో భాగంగా ఢిల్లీకి శిక్షణ కోసం తన అనుచరుడైన నాగోల్‌కు చెందిన రాజశేఖర్‌ను పంపించాడు. రాజశేఖర్ శిక్షణ పొంది తిరిగి హైదరాబాద్‌కు చేరుకొని ఇన్‌స్టాలో ప్రకటన ఇచ్చాడు.
ఉప్పల్ భాగాయత్లోని శిల్పారామం వద్ద శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. బట్టతల ఉన్నవాళ్లు ఇది చూసి… వందలాదిగా అక్కడకు చేరుకున్నారు. నిర్వాహకుడు వచ్చిన వారి కోసం టెంట్లు వేశాడు.. సిబ్బందిని నియమించుకున్నాడు. అక్కడకు వచ్చిన వారి వద్ద నుంచి రూ. 300 ఎంట్రీ ఫీజు వసూలు చేశాడు. ఎంట్రీ ఫీజు కట్టిన వారిని లోపలికి తీసికెళ్లి రూ.700 వసూలు చేసి ఒక షాంపో ఇచ్చారు, ఆ తరువాత వారికి గుండు గీసి, ఆ షాంపోను వారి గుండుపై రుద్దారు.. మూడు నెలల్లో జట్టు వస్తుందని వాగ్దానం చేశారు. అయితే అక్కడకు వచ్చిన వారితో గందరగోళ పరిస్థితి ఉండడంతో ఉప్పల్ పోలీసులు విషయం తెలుసుకొని, వచ్చిన వారందరినీ అక్కడి నుంచి పంపించి, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
గుడ్డిగా నమ్మేస్తున్నారు..!
అమాయకులను సోషల్‌మీడియా ఇనుఫ్లూయర్స్ కొందరు ప్రకటనలతో ఈజీగా మోసం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు సోషల్‌మీడియాను వాడుకుంటున్నారు. ఇలా తక్కువ ధరకు వస్తువులు అమ్ముతామంటూ, అసాధారణమైన పనులు సాధ్యం చేస్తామంటూ ఇస్టానుసారంగా ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రకటనలతో కస్టమర్లు ఈజీగా ఆకర్షితులవుతుండడంతో ఇనుఫ్లూయర్స్ సైతం ఏదీ నిజం, ఏదీ అవాస్తవం అని ఆలోచించకుండా నమ్మేస్తున్నారు. సోషల్‌మీడియాలో వచ్చేవన్నీ నిజాలనుకునే కొందరు ఇలాంటి ప్రకటనలు చూసి గుడ్డిగా మోసపోతున్నారు.