సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు గత వారం రోజుల్లో ఐదు కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ నాగలక్ష్మి వెల్లడించారు. బాధితులకు రూ. 21,60,112 రిఫండ్ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే లాభాలిస్తామంటూ నమ్మించి సైబర్‌నేరగాళ్లు బాధితుడి రూ. 51.50 లక్షలు మోసం చేశారు. ఈ కేసులో వెస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన కడాలి వెంకట కృష్ణను అరెస్ట్ చేశారు. నిందితుడు సైబర్‌నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
మరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో బాధితుడి వద్ద నుంచి సైబర్‌నేరగాళ్లు రూ. 1,44,20,000 మోసం చేశారు. ఈ కేసులో తిరుపతి జిల్లాకు చెందిన పాముల వెంకటేశ్‌ను అరెస్ట్ చేశారు. మరో కేసులో బాధితుడు రూ. 4.43 లక్షలు మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు చార్మినర్‌కు చెందిన మహ్మద్ యూనస్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్‌లో బాధితురాలి వద్ద నుంచి సైబర్‌నేరగాళ్లు రూ. 64 లక్షలు కొట్టేశారు. ఈ కేసులో సికింద్రాబాద్‌కు చెందిన సోనబోయిన రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోన్ ఇప్పిస్తామంటూ నమ్మించి బాధితుడి వద్ద నుంచి రూ. 5.11 లక్షలు కాజేసిన కేసులో నల్గొండ జిల్లాకు చెందిన కాలకొండ మహేశ్‌ను పట్టుకున్నారు.