Robbery | ఘట్కేసర్, సెప్టెంబర్ 22 : పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న రూ.2కోట్లు , 28 తులాల బంగారు ఆభరణాలను తస్కరించారు. పోలీసుల కథనం ప్రకారం.. చౌదరిగూడ సమీపంలోని మక్త గ్రామానికి చెందిన నాగభూషణం (76) కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరు విదేశాల్లో ఉంటున్నారు. కాగా నాగభూషణానికి చెందిన భూమి శంకర్‌పల్లిలో ఉండగా అమ్మకానికి పెట్టాడు.
అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ. 2 కోట్లు ఇంట్లో దాచిపెట్టాడు. దొంగలు ఆదివారం తెల్లవారుజామున రెండు కోట్ల రూపాయలు, 28 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సోమవారం బ్యాంకులో డిపాజిట్ చేయాలని బాధితుడు అనుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి ఆధ్వర్యంలో పోచారం సీఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంతో దొంగతనానికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.