కీసర, ఏప్రిల్ 22: బిట్ కాయిన్ పేరుతో బాధితులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కీసర పోలీసులు తెలిపిన ప్రకారం… లైకా కాయిన్ పేరుతో కొంతమంది కేటుగాళ్లు రూ.10వేలు పెడితే రూ. 30వేలు ఇస్తామని అమాయకులను నమ్మించి మోసం చేశారు.
అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఆన్లైన్ కంపెనీ పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించిన నిందితులు పత్తా లేకుండా పోవడంతో పెట్టుబడి పెట్టిన బాధితులు లబోదిబోమంటున్నారు. లైకా బిట్ కాయిన్ ఆన్లైన్లో ఎత్తివేయడంతో కీసరకు చెందిన రాగుల శ్రీరంగం, వీరేంద్ర, బ్రహ్మచారి అనే బాధితులు రూ. 11లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత కొన్ని రోజులుగా కీసరలో నివసిస్తున్న నాగుల నర్సింహస్వామి, కరీంనగర్ ప్రాంతానికి చెందిన గుట్టు కుమారస్వామితో కలిసి దమ్మాయిగూడలోని పద్మశాలి కాలనీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. లైకా బిట్ కాయిన్ పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో రూ. 10వేలు పెడితే రూ.30వేల లాభాలు వస్తాయని నమ్మించడంతో బాధితులు ఆశలో పడి రూ.10వేల నుంచి లక్షల రూపాయల్లో పెట్టుబడి పెట్టారు.
దమ్మాయిగూడలోనే బాధితులు సుమారు రూ. 3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. ఉన్నట్టుండి ఆన్లైన్ వెబ్సైట్ను ఎత్తివేయడంతో మంగళవారం కీసరకు చెందిన బాధితులు రాగుల శ్రీరంగం తాను సుమారు రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లైకా బిట్ కాయిన్ పేరుతో జరుగుతున్న మోసాలపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని కీసర సీఐ శ్రీనివాస్ తెలిపారు.