మారేడ్‌పల్లి, జనవరి 13: ఒడిశా బరంపూర్ నుంచి మహారాష్ట్రలోని దాదర్ వరకు రైల్లో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల్లో ఒకరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.50లక్షల విలువ చేసే 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్సీ ఎస్ఎన్ జావెద్, రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు వివరాలు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఎస్కే ఖోడాబాక్స్ భవన నిర్మాణ కార్మికుడు. జీవనోపాధి నిమిత్తం ఒడిశాకు వెళ్లాడు. అక్కడ అదే ప్రాంతానికి చెందిన అలీఖాన్, మహారాష్ట్రకు చెందిన జాయ్లు పరిచయం అయ్యారు. అప్పటికే అలీఖాన్ గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇందులో భాగం గా ఈ నెల 12న అలీఖాన్, జాయ్లు బరంపూర్‌లో 6 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వీటిని సరఫరా చేసే బాధ్యతను ఖోడాబాక్స్కు అప్పగించారు.
దీంతో అతను గంజాయి తీసుకొని బరంపూర్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి ఈ నెల 13న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ప్లాట్ ఫారం – 7 లో మహారాష్ట్రకు వెళ్లేందుకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పటికే ప్లాట్ ఫారంపై తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అతని బ్యాగ్ తనిఖీ చేయగా అందులో గంజాయి ఉండగా.. వెంటనే అదుపులో కి తీసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ రమేశ్ , సిబ్బంది హరిలాల్, భవానీ శంకర్, కరుణమూర్తి, గోవింద రాజులు, తదితరులు పాల్గొన్నారు.