బంజారాహిల్స్, మార్చి 11: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో 28 కిలోమీటర్ల పరిధి నుంచి 40 కిలోమీటర్ల పరిధికి మార్చాలని డిమాండ్ చేస్తూ పలు మండలాలకు చెందిన రైతులు మంగళవారం బంజారాహిల్స్‌లోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆర్ఆర్ఆర్ భూనిర్వాసిత ఐక్యవేదిక (ఉత్తర భాగం) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో వేదిక కన్వీనర్ చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం చుట్టూ ఇప్పటికే ఉన్న ఓఆర్ఆర్ మీద ఇంకా పూర్తిస్థాయిలో రద్దీ లేకున్నా రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో కొత్త రోడ్డు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. వేలాది మంది రైతుల పాలిట శాపంగా మారిన ఆర్ఆర్ఆర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినా రైతులకు అతి తక్కువ నష్టం ఉండేలా చూస్తామని చెప్పారన్నారు.
అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర భాగంలోని ఆర్ఆర్ఆర్ పరిధిని 28 కిలోమీటర్లకు కుదించడంతో ఖరీదైన భూములు కోల్పోతున్నామన్నారు. ముఖ్యంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని భూములు, వలిగొండ, మండలోని భూములు రాయగిరి, గజ్వేల్, సంగారెడ్డి మునిసిపాలిటీ, రూరల్ ఏరియాలలో ఎకరానికి సుమారు రూ.2 నుంచి రూ.5కోట్లు మార్కెట్లో ధర ఉండగా తమకు కేవలం రూ.34 లక్షలు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో ఆర్ఆర్ఆర్ బూచిని చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు నోరు మెదపడం లేదని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి కనీసం రైతులతో మాట్లాడిన పాపాన పోలేదన్నారు.
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ డీపీఆర్‌లో తప్పులు ఉన్నాయని, రీ సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఓఆర్ఆర్ నుంచి 28 కిలోమీటర్లకు బదులుగా 40 కిలోమీటర్లకు మారుస్తూ కొత్త డీపీఆర్ ను తయారు చేయాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్, చిట్యాల, వలిగొండ, భువనగిరి, గజ్వేల్ నుండి సంగారెడ్డి వరకు ఇప్పటికే ఉన్న 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేస్తున్నందున ఆర్ఆర్ఆర్ అసవరమే లేదన్నారు. 15 ఏండ్ల కిందట వేసిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తుతం 25% ఆక్యుపెన్సీ కూడా లేని పరిస్థితి ఉండగా.. 30 ఏళ్ల తర్వాత అవసరాల కోసం ఇప్పుడే రైతులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు.
దక్షిణ భాగంలో ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను రాజకీయ నాయకుల అవసరాల కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం 28 కిలోమీటర్ల నుంచి 40-50 కిలోమీటర్లకు మార్చిన ప్రభుత్వం ఉత్తర ప్రాంతంలోని రోడ్డు గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 113 గ్రామాల్లో 4705 ఎకరాల భూమి సేకరిస్తామని చెప్పిన అధికారులు డంబెల్ మోడల్ పేరుతో 6వేల ఎకరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం.. భూసేకరణలో కోల్పోతున్న భూనిర్వాసితులలో 80% రైతులు నుంచి అంగీకార పత్రం తీసుకోవాల్సి ఉందని, భూ నిర్వాసిత రైతులతో కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వో తదితర అధికారులు మాట్లాడి వాళ్లకేం కావాలో అడిగి తెలుసుకుని 80 శాతం మంది రైతులను ఒప్పించి భూమి తీసుకోవాల్సి ఉంటున్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం 20% రైతుల అంగీకారంతో భూ సేకరణ చేయకుండానే టెండర్లకు నోటీసులు ఇచ్చి 2013 భూ సేకరణ చట్టాన్నికి తూట్లు పొడుస్తూ రైతుల నుంచి అన్యాయంగా భూములను గుంజుకోవాలని చూస్తున్నారన్నారు. చట్టం ప్రకారం బహిరంగ మార్కెట్ రేట్ కి రెండింతలు మున్సిపాలిటీలలో, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్ల పరిహారం ఇచ్చి తీసుకుపోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్టేష్రన్ వ్యాల్యూని మార్కెట్ వ్యాల్యూ అని చెప్పి భూ సేకరణ చట్టం 2013 కి తూట్లు పొడుస్తున్నదని ఆరోపించారు. తమ అంగీకారం లేకుండా టెండర్ ప్రక్రియను ప్రారంభించవద్దని, ఎట్టి పరిస్థితిలో ఆర్ఆర్ఆర్ కోసం భూములు ఇచ్చే ప్రసక్తేలేదంటూ ఆర్ఆర్ఆర్ భూనిర్వాసిత ఐక్యవేదిక నేతలు నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, అలైన్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని, తాము ఏమీ చేయలేమని అధికారులు తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
పచ్చని పొలాలు పోతుంటే తట్టుకోలేకపోతున్నాం..
మేం ముగ్గురం అన్నదమ్ముళ్లం. మా కుటుంబానికి ఆరున్నర ఎకరాల పొలం ఉన్నది. దీనిలో నాలున్నర ఎకరాల పొలం ఆర్ఆర్ఆర్ కోసం పోతుందని చెబుతున్నారు. మాకు ఏడుమంది వారసులు ఉన్నారు. వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నాం. భూమి పోతే రోడ్డున పడాల్సిందే. వరి పంట పండే పచ్చని భూములు మావి. మూసీ కింద నీళ్లతో ఏడాదికి రెండు పంటలు పండే భూములు రోడ్డు కోసం పోతే మాకు ఆత్మహత్యలే మార్గం. మా ఊర్లో నర్సిరెడ్డి అనే రైతు భూమి పోతుందన్న బెంగతో ఏడాది కిందట గుండెపగిలి చనిపోయాడు.
– జనార్దన్‌రెడ్డి, ముందోళ్లగూడెం
మా ఇంట్లోనే ముగ్గురి ప్రాణాలు పోయాయి..
ఆర్ఆర్ఆర్ వస్తుందని చెప్పినప్పటి నుంచి మా ఊర్లో జనం గుండెలు పగులుతున్నాయి. మా ఇంట్లోనే ముగ్గురు చనిపోయారు. సర్వే నంబర్ 201, 202లో మా అన్నదమ్ములందరికీ కలిసి 28 ఎకరాల పొలం ఉంది. ఏడుగురం అన్నదమ్ముళ్లం. రోడ్డు కోసం పొలం పోతదనే ్చందంటూ తప్పించుకుని తిరుగుతున్నారు.
-బీసం కృష్ణయ్య, వర్కట్పలి ్ల(ఎస్సీ మాల)