హైదరాబాద్ మహానగర రవాణా ముఖ చిత్రాన్ని మార్చాల్సిన మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిబంధకాలుగా మారాయి. విశ్వ నగరంగా శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చాల్సింది పోయి, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాయి. గత రెండున్నరేళ్లు కమిటీలు, అధ్యయనాలు, నివేదికలతోనే సరిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ క్యాప్స్ ఆధ్వర్యంలో మరో కమిటీని నియమించి, ప్రాజెక్టును మరో 6 నెలల పాటు కోల్డ్ స్టోరేజీలోకి నెట్టేసింది. దీంతో అసలు నగరానికి మెట్రో రెండో దశ తీసుకురావాలనే చిత్తశుద్ధ్ధి పాలకులకు లేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరవ్యాప్తంగా ట్రాఫిక్ జాంలతో నిండిపోతున్న తరుణంలో ఆర్టీసీ తర్వాత ప్రధాన రవాణా వ్యవస్థగా మెట్రో ఎదిగింది. అయితే పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రోను నగరవ్యాప్తంగా విస్తరించాలనే ప్రతిపాదనలకు కేంద్రం కొర్రీలు పెడుతూనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో విస్తరణపై ప్రగల్భాలతోనే ప్రాజెక్టును ముందరవేసుకున్నది. హడావుడిగా డీపీఆర్ రూపొందించి, జన సంచారమే లేని ప్రాంతాలకు మెట్రోను పరుగులు పెట్టించడానికి ఉవ్విళూరింది. ఈ క్రమంలో దాదాపు 120 కిలోమీటర్ల పొడువున్న మెట్రో నిర్మిస్తామని, రూ.45వేల కోట్లతో కాంగ్రెస్ సర్కార్ అంచనాలను సిద్ధం చేసింది.
కానీ కార్యాచరణలో మాత్రం ఎప్పుడో పూర్తి కావాల్సిన ఓల్డ్ సిటీ మెట్రోకి అవసరమైన భూసేకరణ పూర్తి చేయలేకపోయింది. ఇలాంటి తరుణంలో సర్కార్ చేతిలో నయా పైసా లేకుండానే ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన మెట్రో డ్రామాలు.. ఇవాళ ఎస్బీఐ క్యాప్స్ వరకు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండున్నరేళ్లలో కమిటీలు, అధ్యయనాలు, శంకుస్థాపనలు, డీపీఆర్‌ల మార్పులు చేర్పులతోనే పబ్బం గడిపేసింది. తొలుత నగరంలో రూట్ల మార్పు, రీ సర్వేల పేరిట కాలయాపన చేయగా… ఆ తర్వాత సాంకేతిక లోపాలు, ప్యాసింజర్ ప్రొజెక్షన్ పేరుతో నెట్టుకొచ్చింది. దీని తర్వాత మెట్రో స్వాధీనం కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ, ఆస్తుల అధ్యయనానికి మరో ఏజెన్సీ నియామకం ఇలా గడిచిన రెండేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడా క్షేత్రస్థాయిలో అడుగు పడలేదు.
చావు కబురు చల్లగా చెప్పిన కేంద్రం..
మెట్రో కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా శంషాబాద్ ఎయిర్ పోర్టు అనుసంధానం, ఓఆర్ఆర్ కారిడార్, ఎల్బీ నగర్ హయత్ నగర్, మియాపూర్-పటాన్ చెరుతోపాటు, నార్త్ సిటీ వైపు మెట్రో లైన్ల కోసం ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ, రేపు అనమతులు వస్తాయి… ఆర్థిక సంస్థలు రుణాలను మంజూరు చేస్తాయంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊరించాయి. తీరా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టుపై మరో 5-6 నెలల వరకు చర్చే లేకుండా చేశాయి.
ఇన్నాళ్లు స్వాధీనం కోసం రాష్ట్ర సర్కార్ చేసిన పనులన్నింటినీ మొదటి నుంచి మళ్లీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఎస్బీఐ క్యాప్స్ చేతికి ఆ బాధ్యతలను అప్పగించి, మెట్రో ఆస్తుల విలువను లెక్కించాలని ఆదేశించింది. ఈ నివేదిక 5-6 నెలలలోపు కేంద్రానికి ఇవ్వాలని పేర్కొంది. అప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, నివేదిక ఆధారంగానే రుణాల మంజూరు ఉంటుందని చావు కబురు చల్లగా చెప్పిన కేంద్రం… ఇన్నాళ్లు రేవంత్ సర్కార్ చేసిన హడావుడికి చెక్ పెట్టింది. అయితే ఈ రెండు ప్రభుత్వాలు చేస్తున్న డ్రామాలతో నగరంలో మెట్రో ఆశలు నీరుగారిపోతున్నాయి.
కమిటీలతో మరింత జాప్యం…
ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి కమిటీ నియామకం ప్రత్యక్ష ఉదాహరణలనీ ప్రజా సంఘాలు, మెట్రో సాధన సమితి ఆరోపిస్తోంది. ప్రజా అవసరాల విషయంలో త్వరితగతిన తీసుకోవాల్సిన నిర్ణయాలను కమిటీల పేరిట తొక్కి పెట్టడం సామాన్యులకు మెరుగైన రవాణా సేవలను దూరం చేసినట్లే అని తెలుస్తోంది. హైదరాబాద్ ప్రగతిని అడ్డుకునే విధంగా ఉన్న ఈ కమిటీలతో ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని మండిపడ్డాయి. ఇప్పటికైనా కమిటీల డ్రామాలను పక్కనపెట్టి… తక్షణమే నగరంలో మెట్రో సేవలు విస్తరించే ప్రణాళికలను ఆచరణలో పెట్టాలని, లేదంటే నగరవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలకు అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.
మెట్రో భవితవ్యంపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఊగిసలాడుతున్న హైదరాబాద్ మెట్రో రైలు భవితకు మార్గనిర్దేశకం చేసేలా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ మెట్రో రైలు- వాస్తవాలు, ప్రజాప్రయోజనాలు, పర్యావరణ పర్యవసానాలు’ అనే అంశంపై బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగే ఈ కార్యక్రమంలో మెట్రో ప్రస్తుత ప్రయాణికుల సంఖ్య, ఆర్థిక స్థితిగతులు, రెండో దశ విస్తరణ, ప్రభావిత ప్రాంతాలు, టికెట్ ధరలు, అందుబాటు ధర, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ, ఆర్టీసీ బస్సుల అనుసంధానం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, పర్యావరణ ప్రయోజనాలు వంటి అంశాలపై చర్చించనున్నారు.