బంజారాహిల్స్, మార్చి 18: హైదరాబాద్ ఫిలింనగర్లో దొంగలు బీభత్సం (Robbery) సృష్టించారు. ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఎన్ఆర్ఐ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు భారీగా బంగారం, నగదు, విదేశీ కరెన్సీ తస్కరించారు. వివరాల్లోకి వెళ్తే .. షేక్‌పేట సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహ్మద్ ముజాహిద్ కమల్ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటారు. జనవరిలో హైదరాబాద్‌కు వచ్చారు. రంజాన్ మాసం కావడంతో ముజాహిద్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా ఇఫ్తార్ విందుకోసం బందువుల ఇంటికి వెళ్లారు.
మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సంమయంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి.. ఇంటి వెనక తలుపు పగలగొట్టబడి కనిపించింది. దీంతో ఆందోళన గురైన ముజాహిద్ లోనికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందర వందరగా కనిపించాయి. రెండు బెడ్రూంలలో అల్మారాలు పగలగొట్టిన దుండగులు 34 తులాల బంగారం ఆభరణాలతో పాటు సుమారు రూ 4.5 లక్షల నగదు, 550 కెనడియన్ డాలర్లు ఎత్తుకెళ్లారు. చోరీ చేయడానికి ముందు ఇంట్లోని సీసీ కెమెరాలు.. డీవీఆర్ ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఫిలిం నగర్ పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.