సుల్తాన్‌బజార్, జూన్ 27: దారి దోపిడీ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్, రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారితో కలిసి సుల్తాన్‌బజార్ ఏసీపీ శంకర్ వివరాలను వెల్లడించారు. గత నెల 19న టీబీ వ్యాధితో బాధపడుతున్న మహ్మద్ ఫెరోజ్.. మందులను కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రాత్రి 7.30 గంటల సమయంలో రంగ్‌మహల్ చౌరస్తాలోని సంగీత ట్రావెల్స్ ప్రాంతానికి చేరుకోగానే ఫెరోజ్‌ను నిజామాబాద్‌కు చెందిన నాగరాజు(34) అతడి స్నేహితులైన మహమ్మద్ షానవాజ్, సిద్ధూ ధనాగర్తో కలిసి అడ్డుకొని తలపై కొట్టడంతో కిందపడ్డాడు.
ఇదే అదనుగా భావించిన నిందితులు.. ఫెరోజ్ వద్ద ఉన్న రూ.8,500 నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయారు. బాధితుడు మహమ్మద్ ఫెరోజ్ జరిగిన ఘటనపై సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. వెంటనే రంగంలోకి దిగిన క్రైం సిబ్బంది ఈ దోపిడీలో జార్ఖండ్‌కు చెందిన మహమ్మద్ షానవాజ్(29), రంగ్‌మహల్ పుత్లీబౌలికి చెందిన సిద్ధూ ధనాఘర్ను అరెస్టు చేసిన విషయం విదితమే. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగరాజు ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నాడు. అతడిని గురువారం సుల్తాన్‌బజార్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు పాతనేరస్తుడని, జైలుకు వెళ్లి వచ్చినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని ఏసీపీ తెలిపారు.