Dasara | సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): దసరా పండుగకు వెళ్లిన నగరవాసులు తిరిగి తమ స్వస్థలాల నుంచి నగరానికి వస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం రహదారులు కిక్కిరిసిపోయాయి. సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతుండటంతో చాలామంది ఆదివారం తిరిగి నగరానికి చేరుకుంటున్నారు.
తెలంగాణ ప్రజలకు దసరా పండుగ ప్రధానమైనది. ఎక్కడున్నా పండుగ రోజు జమ్మి చెట్టు పూజకు చేరుకోవాలని అందరూ తమ స్వగ్రామాలకు చేరుకుంటారు. ఈ సారి పండుగ రెండో శనివారం కావడంతో చాలా మందికి సెలవు పోయింది.. వెంటనే ఆదివారం కావడంతో దసరాకు వచ్చిన రెండు రోజులు పూర్తయ్యాయి. బంధుమిత్రులతో దసరా ఉత్సవాలు తమ స్వస్థలాల్లో జరుపుకొన్న నగర వాసులు తిరిగి హైదరాబాద్కు చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో జాతీయ రహదారులపై నగరం నలుమూలల ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల సంఖ్య భారీగా కనిపించింది. ఉత్తర తెలంగాణ నుంచి నగరానికి వచ్చే వారి వాహనాలతో రాజీవ్ రహదారి కిక్కిరిసింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ ప్లాజా గేట్లు ఎత్తేశారు. అలాగే మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, జహీరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చే రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా కనిపించింది.