మల్కాజిగిరి, ఫిబ్రవరి 24 : స్వచ్ఛ హైదరాబాద్ దిశగా జీహెచ్ఎంసీ అధికారులు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రోడ్లు, కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా చర్యలు చేపడుతున్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని రోడ్ల వెంట ఇప్పటికే దాదాపు 200 డస్ట్ బిన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడంతో రూ.5.70లక్షలతో మరో 60 డస్ట్ బిన్లను ఏర్పాటు చేసి రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోకుండా తడి, పొడి చెత్త డబ్బాలతో పాటు హానికరమైన చెత్త వేయడానికి ప్రత్యేకంగా డబ్బాను ఏర్పాటు చేశారు.
సైనిక్‌పురి నుంచి రామకృష్ణాపురం ఫ్లై ఓవర్, నేరేడ్మెట్ చౌరస్తా నుంచి సఫిల్‌గూడ, సఫిల్‌గూడ నుంచి మిర్జాలగూడ వరకు రద్దీ ప్రాంతాల్లో ఈ మూడురకాల డబ్బాలు దర్శనమిస్తున్నాయి. 180 మంది పారిశుధ్య కార్మికులు, 19 పెద్ద లారీలు, 3 చిన్న లారీలతోపాటు చిన్న జేసీబీలతో ఈ చెత్తను సేకరిస్తున్నారు. 194 ఆటో ట్రాలీల ద్వారా ఇంటింటికీ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తను సేకరిస్తున్న వాహనాలను బార్ కోడ్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ద్వారా మంచి ఫలితాలు రావడంతో పాటు కాలనీలు, రోడ్లు సుందరంగా దర్శనమిస్తున్నాయి. ఇకనుంచి ఎవరూ రోడ్లపై చెత్తవేయవద్దని, చెత్త డబ్బాలను ఉపయోగించాలని అధికారులు కోరుతున్నారు.