గోల్నాక, ఏప్రిల్ 7: కత్తితో బెదిరిస్తూ దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అంబర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. సోమవారం అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ పి.మల్లేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం… గోల్నాక లాల్ బాగ్ చెందిన అభిషేక్ యాదవ్ (20), షేక్ హుస్సేన్(22), మాసాంబిషా(20) స్నేహితులు.
ముగ్గురు కలిసి ఒకే రూంలో ఉంటూ కేటరింగ్ పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కాగా సోమవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో పని ముగించుకొని తమ ఇంటికి వస్తుండగా లాల్ బాగ్ వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అడ్డగించి వారిని కత్తితో బెదిరించి రూ.7వేల లాక్కుని పారిపోయారు. స్థానికుల సాయంతో వారిని వెంబడించంగా అందులో ఒక వ్యక్తి అభిషేక్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో అభిషేక్ కుడి చేతికి స్పల్ప గాయమైయింది.
దీంతో బాధితులు అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దారి దోపిడీకి పాల్పడ్డ నిందితులు గోల్నాక లాల్ బాగ్ మజీదు ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా (21), యూసుఫ్ (20), సయ్యద్ అమీర్(21) గా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని సోమవారం రిమాండ్ కు తరలించారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.