Hyderabad | ఎల్బీనగర్, జూలై 29 : కొత్తపేట డివిజన్ తెలంగాణ పార్కు వద్ద ఎస్ఆర్ఎల్ కాలనీ నడిరోడ్డుపై గుంత పడటంతో ప్రమాదకరంగా మారింది. గాయత్రిపురం, నాగేశ్వరకాలనీ, ఎస్ఆర్ఎల్ కాలనీలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో ఈ దారిలో ప్రయాణించే వారికి రోడ్డు మద్యలో ఏర్పాడిన గొయ్యితో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాంతంలో ఒక కర్ర పెట్టి దానికి చుట్టూరా ఒక రిబ్బన్ కట్టి ఇక్కడ ప్రమాదం ఉందని తెలిపే విధంగా రాళ్లను ఏర్పాటు చేశారు. అసలే వర్షాకాలం కావడంతో నడి రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న ఈ గుంతను వెంటనే మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాలు పడిందంటే ఈ రోడ్డుపై పెద్ద ఎత్తున వరదనీరు పారుతుంది. ఈ సమయంలో ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల ముందే ఈ దారిలోనే వరదనీటి కాలువ పైకప్పు కూడా కూలిపోయింది. ఈ విషయంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై మరమ్మత్తులు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.