Amberpet | అంబర్పేట, మార్చి 20 : అంబర్పేట శ్రీరమణ చౌరస్తా సమీపంలోని లక్కీ కేఫ్ మూడు రోడ్ల కూడలి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. శ్రీరమణ చౌరస్తా, అనంతరాంనగర్ కాలనీ నుంచి వచ్చే వాహనాలు, పాదచారులు ఈ కూడలి మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల వరదనీటి కాలువ ఏర్పాటు కోసం జీహెచ్ఎంసీ సిబ్బంది ఈ కూడలిలో భారీ గోతులు తీసి పైప్లైన్ వేశారు. అయితే పైప్లైన్ పనులు పూర్తయిన తర్వాత గోతులను ఎగుడుదిగుడుగా పూడ్చిన కాంట్రాక్టర్ రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని ఇంతవరకు తరలించలేదు. దీంతో కూడలి మీదుగా రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మట్టిలో టైర్లు కూరుకుపోయి అదుపుతప్పి వాహనాలు కిందపడుతూవాహనదారులు గాయాలపాలవుతున్నారు.
అదేవిధంగా నడుచుకుంటూ వెళ్లేవారు సైతం కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల అనంతరాంగర్లో నివాసముండే సీనియర్ జర్నలిస్ట్ బి.వి.శేఖర్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ లక్కీ కేఫ్ కూడలిలో కిందపడి ఆయన కాలు విరిగి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా పలువురు మహిళలు నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలయ్యారు. దీనికి తోడు ఈ కూడలిలో ఆటోల అక్రమ పార్కింగ్ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. కూడలిలో పేరుకుపోయిన మట్టిని తరలించాలని, ఆటోల అక్రమ పార్కింగ్ నివారించాలని ఇటు జీహెచ్ఎంసీ, అటు ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.