ఏప్రిల్ 13న అఫ్జల్‌గంజ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర ఐరన్రెయిలింగ్ పాయింట్ మధ్య నుంచి ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన టూవీలర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. నగరంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 40శాతం ఇలాంటి ఘటనలే ఉంటున్నాయి. దీనికి తోడు హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, డ్రంకెన్ డ్రైవ్ తదితర నిబంధనల ఉల్లంఘనలతో కూడా పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
– సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యేడాది జనవరి నుంచి మే నెల వరకు 5 నెలల కాలంలో నగరంలో 1,810 ప్రమాదాలు జరగగా, 152 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో అధికశాతం పాదచారులు, ద్విచక్రవాహనదారులే ఉన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు హెల్మెట్ ధరించకపోవడంతో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రిపూట జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం మత్తుతోనే జరుగుతున్నాయి. ఏటేటా పెరుగుతున్న వాహనాలతో పగలూరాత్రి రహదారులు రద్దీగా మారుతున్నాయి. నగరంలో రోడ్డు ప్రమాదాల కట్టడికి పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు కఠిన నిబంధనలు పెట్టినా వాహనదారులు పట్టించుకోవడం లేదు. ప్రధాన రోడ్లలో చుట్టూ తిరిగిరావడానికి కష్టంగా భావిస్తున్న పాదచారులు.. రాంగ్ డైరెక్షన్లో రోడ్లను దాటేందుకు యత్నించే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు.
ప్రమాదాలకు ప్రధాన కారణాలివే..!
గమ్యం చేరాలనే తొందరలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టూవీలర్లు, కార్లు, ఆటోలు మితిమీరిన వేగంతో దూసుకెళ్లడంతో పాటు వీడియోలు, రీల్స్ చూస్తూ వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అధికశాతం ప్రమాదాలకు అతివేగం, నిద్రమత్తు, అడ్డదారి ప్రయాణాలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్ ధరించకపోవడం, ఇష్టానుసారంగా రోడ్లు దాటడం వంటివి ప్రధానంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాల బారిన పడుతున్న వారిలో 19 నుంచి 35 ఏళ్ల వయసు మధ్యవారే ఎక్కువగా ఉంటున్నారు. వీకెండ్ పార్టీలకు వెళ్లి అదే మత్తులో ఇల్లు చేరే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా ప్రధాన మార్గాలతో పాటు కాలనీల్లో ఉండే గుంతలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కూడా లేకపోవడం, జీబ్రాక్రాసింగ్ లేన్ల వద్ద పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
54 బ్లాక్ స్పాట్ల గుర్తింపు..
నగర పరిధిలో ట్రాఫిక్ పోలీసులు 54 బ్లాక్స్పాట్లు గుర్తించగా ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారని ట్రాఫిక్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల పెరిగిన ప్రమాదాల తీవ్రతపై హైదరాబాద్ సీపీ.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ, పోలీసు అధికారులతో చేసిన సమీక్ష తర్వాత ఈ అంశాలను గుర్తించారు . వీటిపై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. తనిఖీలు మరింతగా పెంచి పౌరుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు.
ఐదునెలల్లో చోటుచేసుకున్న ప్రమాదాలు!
గత ఐదు నెలల్లో 1,810 ప్రమాదాలు జరిగితే అందులో 68 మంది ద్విచక్రవాహనదారుల్లో హెల్మెట్ లేని వారు కాగా, వారిలో వాహనం వెనక కూర్చున్నవారు 23మంది ఉండటం గమనార్హం. మరోవైపు ఈ ప్రమాదాల్లో మరణించినవారిలో 40శాతం మంది పాదచారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఐదునెలల్లో ప్రమాదాలు జరగడానికి కారణాలను పరిశీలిస్తే అతివేగం 34, డ్రంకెన్ డ్రైవ్ 1, రాంగ్‌సైడ్ డ్రైవ్ 1, మైనర్ డ్రైవింగ్ 3, ఓవర్‌టేకింగ్ 1, నిర్లక్ష్యం 97, ఇతరత్రా 2 కారణాలుగా అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రమాదాల్లో మృతుల సంఖ్య 152 కాగా, అందులో హెల్మెట్ లేకుండా 68 మంది, రోడ్డుదాటే పాదచారులు 57 మంది, ఇతర కారణాలతో 27మంది చనిపోయారు.
