Road Accident | వనస్థలిపురం, మార్చి 20 : మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి అర్థరాత్రి మన్సురాబాద్ పోచమ్మ గుడి వద్ద బీభత్సం సృష్టించాడు. ఓ బైక్ను ఢీకొట్టి 300 మీటర్ల మేర ఆ బైకును లాక్కొని వెళ్ళాడు. అక్కడ మరో మూడు కార్లను ఢీకొట్టాడు. దీంతో ఆ ప్రాంమంతా భయాందోళనలు నెలకొన్నాయి. బీభత్సం సృష్టించిన ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి తన కారు(టీఎస్07జేయు5527)లో మన్సురాబాద్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్నాడు. పోచమ్మ టెంపుల్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్క నుంచి వెళ్తున్న బైకును ఢీ కొట్టింది. ఆ బైక్ కారుకు లింకు కావడంతో సుమారు 300 మీటర్ల పాటు లాక్కొని వెళ్ళింది. బైక్ నడుపుతున్న వగరు దివ్యాన్షు, ఆయన సోదరి నిఖిత రెడ్డిలకు గాయాలయ్యాయి. అదే సమయంలో పక్కనే ఉన్న మూడు కార్లను ఢీకొట్టారు. ప్రమాదం జరగగానే బైక్పై ఉన్న ఇరువురు కింద పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ప్రమాదం రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరగడంతో ఇటు వనస్థలిపురం పోలీసులు, అటు ఎల్బీనగర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు