RK Puram | ఆర్కేపురం, మార్చి 19 : ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ వ్యవసాయ కూరగాయల మార్కెట్ ప్రహరీ గోడ పక్కన రహదారిలో చెత్త పేరుకుపోయి డంపింగ్ యార్డ్‌ని తలపిస్తుంది. గత కొన్ని నెలలుగా ఈ దారిలో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పేరుకుపోయిన చెత్తను నిత్యం తొలగించాల్సిన పారిశుధ్య సిబ్బంది నాలుగైదు రోజులకు ఒక్కసారి తరలిస్తుండడంతో పక్కనే నివాసముండే వారికి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
చికెన్, మటన్ షాప్ నిర్వాహకులు వ్యర్ధాలను సైతం తెచ్చి అక్కడే పడేస్తుండడంతో రాత్రి సమయంలో వీధి కుక్కలు అక్కడ జమై అటుగా వెళ్తున్న వారిపై దాడులకు దిగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు. జిహెచ్ఎంసి అధికారులు చొరవ తీసుకొని ప్రతినిత్యం చెత్తను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.