సిటీబ్యూరో, మార్చ్ 25 (నమస్తే తెలంగాణ): ఉష్ణోగ్రతలు చల్లబడినా కరెంట్ డిమాండ్ పెరుగుతుండడంతో దక్షిణ డిస్కం అధికారుల్లో టెన్షన్ పెరుగుతున్నది. అసలే వేసవికాలం.. అందునా డిమాండ్ పీక్ స్థాయికి చేరే సమయంలో గ్యాస్ కొరత పేరుతో విద్యుత్ స్టవ్లు, ఇతర పరికరాల వినియోగంతో కరెంట్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.
గత మార్చి 23న 68.8 ఎంయూల డిమాండ్ నమోదైతే ఈ సంవత్సరం మార్చి 23న 76.72 ఎంయూల డిమాండ్ నమోదైంది. 24న గత సంవత్సరం 75.9 ఎంయూ నమోదు కాగా ఈసారి
అదేరోజు 77.8 ఎంయూ నమోదైంది. అయితే మంగళవారం వాతావరణం చల్లబడడంతో పాటు వర్షం కురవడంతో సహజంగా విద్యుత్ వినియోగం తగ్గాలి. కానీ గతం కంటే ఎక్కువగా నమోదవడానికి కారణం విద్యుత్ పరికరాల వినియోగం పెరగడమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత కొద్దిరోజులుగా రోజువారీ సగటు వినియోగం గతం కంటే 12 నుంచి 14 మిలియన్ యూనిట్లు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు చెప్పారు. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ 110 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా వేయగా, మార్చిలోనే 80 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. వంటగ్యాస్ కొరతతో వినియోగదారులు ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇమ్మెర్షన్ హీటర్లు వాడుతున్నారు.
ఫలితంగా గృహవినియోగంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీంతో ఎప్పుడు ఫీడర్లు ట్రిప్ అవుతుందో తెలియక చాలా చోట్ల ఫీడర్ల, ఇన్సులేటర్ల పరిస్థితిని గమనించడానికి డ్రోన్ కెమెరాలతో వివరాలు సేకరిస్తున్నారు. ఒక డ్రోన్ కెమెరా ద్వారా పోల్ వద్ద ఇన్సులేటర్ల పరిస్థితిని ఫొటోల రూపంలో తీసుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరమ్మతులు అవసరమైన చోట సిబ్బందిని సమాయత్తం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.