నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉన్న ఐబొమ్మ రవి తరఫున సైబర్ క్రైమ్ అధికారులు దాఖలు చేసిన పోలీసు కస్టడీ రివిజన్ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేస్తూ శుక్రవారానికి వాయిదా వేస్తూ జిల్లా కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కింది స్థాయి కోర్టు జారీ చేసిన ఉత్తర్వును చాలెంజ్ చేస్తూ పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. నాలుగు కేసులకుగాను మూడు కేసుల్లో మాత్రమే ఒక్కోరోజు చొప్పున పోలీసు కస్టడీకి అప్పగిస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని పీపీ తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ కుబేర, కిష్కిందపురి, హిట్, తండేల్ సినిమాలకు సంబంధించిన పైరసీ వ్యవహారంపై రవి నుంచి అన్ని వివరాలను తెలుసుకోవాల్సి ఉందని, ఇంకా విచారణ పూర్తికాలేదని కోర్టుకు తెలిపారు.
కేవలం ఒక్క కేసులో మాత్రమే రెండుసార్లు 8 రోజుల పాటు పోలీసు కస్టడీలో అధికారులు విచారించారని, మిగిలిన నాలుగు కేసుల్లో విచారణ ముగించాల్సి ఉందని పీపీ తెలిపారు. నాలుగు కేసులకు గాను పూర్తిస్థాయి విచారణకు సమయం సరిపోలేదని, ఒక్కో కేసుకు 5రోజుల చొప్పున పోలీసు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌పై గురువారం ఇరువైపులా వాదనలు ముగిశాయి. నిందితుడి తరఫున న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన అనంతరం వాదనలు వినిపించారు. ఒక్క కేసులోనే 8రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకుని రవిని అధికారులు విచారించారని, పూర్తిస్థాయి సమాచారాన్ని అధికారులు సేకరించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం పోలీసు కస్టడీకి నిందితుడిని అప్పగించాల్సిన అవసరం లేదని వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేస్తూ జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
ఐబొమ్మ రవికి కోర్టులో చుక్కెదురైంది.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం కోర్టు తీర్పు వెల్లడించింది. ఫిలీం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధినేత యార్ర మనీంద్రబాబు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో రవికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గురువారం తీర్పు వెల్లడించింది. సినీ పరిశ్రమను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసినట్టు విచారణలో తేలిందని పీపీ చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మొత్తం 5 కేసుల్లోనాలుగు కేసుల్లో విచారణ ఇంకా పూరి ్తకాలేదని, విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో నిందితుడికి బెయిల్ మంజూరు చేయరాదని, సాక్షులను-సాక్షాధారాలను తారుమారు చేసే ఆవకాశముందని పీపీ వాదనలు వినిపించారు. అన్ని కేసుల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టాల్సి ఉందని, అప్పటిదాకా రవికి బెయిల్ మంజూరు చేయరాదని పీపీ వివరించారు.