ముషీరాబాద్, ఏప్రిల్ 29: హైదరాబాద్లోని ముషీరాబాద్ మండల పరిధిలో రోడ్లపైనే బోర్వెల్ తవ్వకాలు చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు రెవెన్యూ సిబ్బంది మామూళ్లు పుచ్చుకొనిచూసి చూడనట్టు వదిలేస్తున్నారు.
ముషీరాబాద్ పరిధిలో పలువురు భవన నిర్మాణదారులు తమ స్థలాలను వదిలేసి రోడ్డుపైనే బోర్లు వేస్తున్నారు. విద్యానగర్ నియో బీబీసీ హాస్పిటల్ సమీపంలో గాంధీనగర్లో రోడ్డుపై బోర్ వేశారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు చూసిచూడనట్టుగా వదిలేస్తున్నారు. విద్యానగర్లో రోడ్డుపై బోరు వేసి నెల రోజులు గడుస్తున్నా, ఫిర్యాదులు అందినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక గాంధీనగర్లో కూడా ఇలాగే బోర్ తవ్వకాలు చేపట్టినప్పటికీ.. భవన నిర్మాణదారుల నుంచి డబ్బులు తీసుకుని చూసీచూడనట్టుగా ఉంటున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ బోర్ల తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.