Land Grabbing | బంజారాహిల్స్: కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఏసీబీ కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదాలు ఉండడాన్ని అదునుగా చూసుకుని స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అప్రమత్తమైన షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్థలాన్ని కాపాడేందుకు చర్యలు ప్రారంభించారు. రెవెన్యూ రికార్డులను, కోర్టు కేసులను పరిశీలించగా సుమారు 12 ఎకరాల ప్రభుత్వ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని, కోర్టుల్లో కేసులు కూడా లేవని తేలింది. సుమారు రూ.1200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు ఇటీవల డీజీపీఎస్ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలానికి హద్దులు నిర్ణయించారు
. యుద్ధ ప్రాతిపదికన స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం హకీంపేట విలేజ్ పరిధిలోని సర్వే నంబర్ 102/1లో టీఎస్ 1/పీ, 3/పీ,బ్లాక్-జే, వార్డు 12 కిందకు వస్తుంది.12 ఎకరాల ప్రభుత్వ స్థలంతో పాటు దీన్ని ఆనుకుని సర్వే నంబర్ 102/2, 102/3లో సుమారు 16 ఎకరాల ప్రైవేటు స్థలం ఉంది. ఈ ప్రైవేటు స్థలంపై అనేక మంది వ్యక్తులు, సొసైటీల మధ్య వివాదాలు వివిధ న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇటీవల ల్యాండ్ బ్యాంక్‌లో ఉన్న స్థలాలను ఆక్రమణలు కాకుండా చూసేందుకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించిన షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి ఏసీబీ ఎదురుగా ఉన్న 12 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. రికార్డులు పరిశీలించగా, ఈ 12 ఎకరాల ప్రభుత్వ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని, సర్వే చేసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసుకుని, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే పకడ్బందీగా సర్వే చేసి ఫెన్సింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇటీవల డీజీపీఎస్ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారు. వారంరోజులుగా స్థలం చుట్టూ ఫెన్సింగ్ పనులు నిర్వహిస్తున్నారు.