దుండిగల్,ఏప్రిల్ 8 : మిత్రుడిని చంపినందుకు ప్రతీకారంగా అతని మిత్రులు నిందితుడిని హత్య చేసి తమ పగ తీర్చుకున్నారు. అనంతరం రక్తపు మరకలతో ఉన్న కత్తులు, చేతులను చూపుతూ.. నృత్యాలు చేస్తూ , కేరింతలు కొడుతూ.. బైక్‌పై ఊరేగుతూ సంబురాలు చేసుకుంటూ వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్‌చేశారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం… ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడకు చెందిన పిల్లి తేజాస్ అలియాస్ తేజూ అలియాస్ డీల్(21) కుటుంబం 20 ఏండ్ల క్రితం వలసవచ్చి, బోరబండ, బీకేగూడలోని ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో స్థిరపడింది.
తేజూ తండ్రి గతంలోనే మృతిచెందగా తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో తేజూ స్థానికంగా ఉండే షేక్ షరీఫ్ అనే రౌడీషీటర్ గ్యాంగ్‌లో పనిచేశాడు. గత ఏడాది అక్టోబర్ 24న బోరబండలో జరిగిన తరుణ్‌రాయ్ అనే వ్యక్తి హత్య కేసులో తేజూ నిందితుడు. ఈ హత్యకేసులో జైలుకు వెళ్లిన తేజూ రెండునెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యాడు. తన మకాంను ప్రగతినగర్‌కు మార్చాడు. అతడి తల్లి మూడు రోజుల క్రితం వేములవాడకు వెళ్లింది. ఆదివారం రాత్రి తేజూ తన మిత్రులైన మహేశ్, శివప్ప, మహేశ్‌తో కలిసి మద్యం సేవిస్తుండగా…వీరికి షమీర్ నుంచి ఫోన్ వచ్చింది.
తేజూ కూడా అక్కడే ఉన్నట్టు తెలుసుకున్న షమీర్ తన పగ తీర్చుకునేందుకు ఇదే సరైన సమయమని భావించాడు. షమీర్ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో సిగరెట్ తాగేందుకని తేజూ, మహేశ్, శివప్ప, మహేశ్ రోడ్డుపైకి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న షమీర్ అతడి అనుచరులు కత్తులు పట్టుకుని వెంబడించి అంబీర్‌చెరువు బతుకమ్మ ఘాట్‌వద్ద తేజూ తలపై బండరాయితో మోదడంతో కిందపడిపోయాడు. కడుపు, చాతీపై విచక్షణా రహితంగా 11సార్లు కత్తులతో పొడిచారు. దీంతో తేజూ అక్కడికక్కడే మరణించాడు.
తేజూ మరణించాడని నిర్ధారించుకున్న హంతకులు అక్కడే వీడియో తీయడంతో పాటు బైక్‌లపై వెళ్తూ రీల్స్ చేశారు. తేజూను చంపిన కత్తులకు రక్తమోడుతుండగా, తమ చేతులకు ఉన్న రక్తపు మరకలను చూపుతూ తరుణ్‌రాయ్ హత్యకు ప్రతీకారంగానే అతడిని చంపినట్లు పేర్కొంటూ సంబురాలు జరుపుకుంటున్న దృశ్యాలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌చేశారు. కాగా ఘటనా స్థలాన్ని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, బాచుపల్లి సీఐ ఉపేందర్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కొంతమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.