కీసర, అక్టోబర్ 15 : జంగయ్య యాదవ్ ‘డౌన్ డౌన్’.. ‘గో బ్యాక్ గో బ్యాక్’ అంటూ భారీ నినాదాలతో కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం మేడ్చల్ టికెట్‌ను బోడుప్పల్ నివాసి అయిన తోటకూర జంగయ్య యాదవ్‌కు కేటాయించడంతో మేడ్చల్ టికెట్ తనకే వస్తుందన్న ఆశతో ఉన్న హరివర్ధన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి కీసరలోని తన పార్టీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన తనను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మోసం చేశారంటూ కార్యకర్తలతో కలిసి హరివర్ధన్‌రెడ్డి కంట తడి పెట్టాడు. రేవంత్‌రెడ్డి టికెట్ ఇస్తానంటేనే పార్టీ కార్యక్రమాలకు ఐదేండ్లుగా రాత్రింబవళ్లు కష్టపడ్డాను అని హరివర్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ రేవంత్ మేడ్చల్ టికెట్ విషయంలో తగిన సమాధానం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి గెలుపు కోసం తను రాత్రింబవళ్లు కష్టపడ్డానని తెలిపారు. రాజకీయం కోసం తన సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజల పక్షాన, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పక్షాన నిలబడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ప్రస్తుతం మౌనంగా ఉండిపోతానని కంట తడి పెడుతూ పార్టీ శ్రేణులకు వివరించారు. సర్వేల ప్రకారం మేడ్చల్‌లో టికెట్ ఇస్తామని చెప్పిన నేతలు తనకు 73 శాతం సర్వేలో అనుకూలంగా ప్రజలు మద్దతు పలికారని, సర్వేలను కూడా కాలదన్ని ప్రజల్లో ఆదరణ లేని జంగయ్య యాదవ్‌కు టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు, హరివర్ధన్‌రెడ్డి అభిమానులు మండి పడ్డారు.
హరివర్ధన్‌రెడ్డి మాట్లాడుతుండగా.. జంగయ్య యాదవ్ ప్రత్యక్ష్యం..
కాంగ్రెస్ పార్టీ సమావేశంలో హరివర్ధన్‌రెడ్డి మాట్లాడుతుండగా.. అంతలో తోటకూర జంగయ్యయాదవ్ ప్రత్యక్ష్యం అయ్యారు. వెంటనే హరివర్ధన్‌రెడ్డి అభిమానులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. రెండు గ్రూపుల నేతలు ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు.
రేవంత్‌రెడ్డి గెలుపు కోసం చాలా కష్టపడ్డా..
మల్కాజిగిరి ఎంపీ స్థానానికి రేవంత్‌రెడ్డి కోసం తను అహర్నిశలు పని చేశానని అన్నారు. మల్కాజిగిరి ఏరియాల్లోని ప్రతి కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కలిసి రేవంత్‌రెడ్డి గెలుపు కోసం కష్టపడ్డానని తెలిపారు. తనను నమ్మించి మోసం చేసిన రేవంత్ తనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
– హరివర్ధన్‌రెడ్డి