ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 11 : మాదిగ జాతిని మోసం చేసిన ద్రోహిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎంఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఉద్యోగ ఫలితాలను ప్రభుత్వం తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం కాకముందే వివిధ పోటీ పరీక్షల ఫలితాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత మూడు దశాబ్దాల పోరాటంతో సాధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను, మాదిగ జాతి నోటికాడి ముద్దను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూరం చేస్తోందని మండిపడ్డారు. అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని నిండు అసెంబ్లీలో మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి నేడు మాదిగ జాతికి ద్రోహం చేస్తూ మాలల కుట్రలు, ఒత్తిళ్లకు లొంగి వర్గీకరణ లేకుండా ఫలితాలను ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మిగతా అన్ని ఉద్యోగ ఫలితాలను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
వర్గీకరణ చేయకుండా ఉద్యోగ భర్తీ చేయడం వలన మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. శాంతియుతంగా చేపట్టిన దీక్షకు పోలీసులు టెంటు వేయనీయలేదని ఆరోపించారు. నిరసన దీక్షకు ప్రముఖ కవి వేముల ఎల్లయ్య హాజరై పూలమాలలువేసి దీక్షను ప్రారంభించారు. వివిధ విద్యార్థుల సంఘాల నాయకులు నాగేశ్వరరావు, జీడీ అనిల్, జంగిలి దర్శన్, కాసర్ల మధు, సుమంత్, వేదాంత మౌర్య, జార్జి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ నాయకులు చిప్పలపల్లి సోమశేఖర్, కొమ్ము శేఖర్, డాక్టర్ పల్లెర్ల సుధాకర్, రాజు, జనపాల మహేశ్, చెడిపల్లి రఘు, ఏడేళ్లి అజయ్, దావు ఆదిత్య, అనిల్, అజయ్ కుమార్, కంజర్ల ప్రేమ్ కుమార్, నిఖిల్, మహిపాల్, అరుణ్, చిన్న, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.