సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 19 (నమస్తే తెలంగాణ): మాటలతో కోతలు కోయడం సులువు.. కానీ చేతలతో మెప్పు పొందడమనేది అంత ఈజీ కాదు సుమా. గత సంవత్సరంతో పోలిస్తే తాజా బడ్జెట్ వరకు కాంగ్రెస్ సర్కారు ఈ తత్వం బోధపడినట్లుంది. అందుకే పోయినేడాది హైదరాబాద్ నగరాభివృద్ధికి చారిత్రాత్మకంగా రూ.10వేల కోట్ల కేటాయింపులు అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వ ‘మహా’ సంకల్పం తాజా బడ్జెట్లో నీరుగారినట్లు స్పష్టమవుతున్నది. అందుకే బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కేసీఆర్ ప్రభుత్వం చేసిన హైదరాబాద్ అభివృద్ధి పనులనే తమ ఖాతాలో వేసుకొని పఠించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గతేడాది రూ.10వేల కోట్లు కేటాయించామని చెప్పుకున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలులో ఏడాదిగా అందులో పావు వంతు నిధులు మాత్రమే విడుదల చేసిన చేతులు దులుపుకొంది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి బదులు ఫ్యూచర్ సిటీ జపం చేసినట్లు అవగతమవుతున్నది.
హైదరాబాద్ విశ్వ నగరమనేది జగమెరిగిన సత్యం. కాకపోతే ప్రభుత్వాలు ముందుచూపుతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తే ఆ మేరకు అంతర్జాతీయంగా ఖ్యాతి విస్తరిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నగరవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనే అనేది దేశంలోని ఇతర మెట్రో నగరాలను తలదన్నేరీతిలో ఉందనేది వాస్తవం. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో మౌలిక వసతులకు సంబంధించి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కకపోగా… గతంలోని ప్రాజెక్టుల పనులు సైతం పూర్తయిన దాఖలాలు లేవు. ఇందుకు గత ఏడాది కాలంగా (2024-25 ఆర్థిక సంవత్సరం) నగరంలోని కీలక విభాగాలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులే నిదర్శనం. గత ఏడాది ఇదే నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం చేతికి ఎముక లేనట్లు కేటాయింపులు చేసింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా నగరాభివృద్ధికి రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేశామంటూ భీకర ప్రచారం చేసింది. కానీ అమలుకు వచ్చేసరికి అందులో 40 శాతం కూడా పూర్తి చేయలేకపోయింది. కీలకమైన జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, మెట్రో, హెచ్ఆర్డీసీఎల్, మూసీ వంటి విభాగాలకు సుమారు రూ.10వేల కోట్ల వరకు కేటాయింపులు చూపారు. కానీ గడిచిన ఏడాది కాలంగా ఆయా విభాగాలకు విడుదల చేసిన నిధులు పరిశీలిస్తే… రూ.2600-3వేల కోట్ల లోపు మాత్రమే ఉంది. అంటే కేటాయింపుల్లో పావు వంతు మాత్రమే కాసులు విదిల్చారు.
హైదరాబాద్ నగరాభివృద్ధిపై తొలి ఏడాదిలోనే బోర్లా పడిన రేవంత్ సర్కారు తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో గొప్పలకు పోలేదుగానీ పాత లెక్కలనే తిరగేసి మమ అనిపించినట్లు తేటతెల్లమైంది. జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, హైదరాబాద్ మెట్రో, హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు సరిగ్గా గత సంవత్సరం ఎలాంటి కేటాయింపులు చేశారో ఇప్పుడు కూడా అవే అంకెలు కనిపించాయి. కానీ ఆయా విభాగాల పరిధుల్లో కొత్తగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను భుజానికెత్తుకున్నారు. మెట్రో విస్తరణ ప్రాజెక్టును రూ.24వేల కోట్లతో ఏకంగా డీపీఆర్‌ను సిద్ధం చేయగా, మరో రూ.20వేల కోట్ల విలువైన మేడ్చల్ మెట్రోకు సైతం సర్వేను మొదలుపెట్టారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) కింద శరవేగంగా జరిగిన ఫ్లెఓవర్లు, వంతెనల నిర్మాణాల పనులు గతేడాది కాలంగా పడకేశాయి. ఇవే పనుల ప్రతిపాదనలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎస్ఆర్డీపీ పేరు మార్చి హెచ్సిటీగా నామకరణం చేసింది. కానీ ఏడాది కాలంగా సగం నిధులు కూడా విడుదల చేయలేదు. పైగా తాజా బడ్జెట్లోనూ గతేడాది కేటాయింపులతో సరిపెట్టిన ప్రభుత్వం అదనంగా ఫ్యూచర్ సిటీలోని 300 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ భారాన్ని సైతం ఈ కార్పొరేషన్‌పై మోపింది. ఇక.. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు సూపర్‌స్పెషాలిటీ సేవలను అందించే సర్కారు దవాఖానాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నగరం నలుమూలలా మొదలైన టిమ్స్ నిర్మాణానికి కాంగ్రెస్ సర్కారు నయాపైసా ఇవ్వకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. పైగా ఉస్మానియా ఆస్పత్రికి రూ.2400 కోట్లు కేటాయించామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పినప్పటికీ కేటాయింపుల్లో అది నల్లపూస కావడం సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనం.