సిటీబ్యూరో/చిక్కడపల్లి, జూన్ 18 (నమస్తే తెలంగాణ): జీవితకాలం ఆర్టీసీకి సేవ చేసి.. చివరి దశలో ఉపయోగపడుతుందని తమ జీతంలో నుంచి దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఇవ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ ఎదుట గురువారం ఆర్టీసీ విశ్రాం త ఉద్యోగులు ఉపవాస దీక్షకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు పది వేలమందికి పైగా రిటైర్ట్ ఉద్యోగులు ఎండలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
“ మా డబ్బులు మాకివ్వండి.. బకాయిలు చెల్లించండి.. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి” అంటూ నినదించారు. బస్ భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో 2 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయంగా రావాల్సిన ఆర్పీఎస్ 2017, 2021 ఏరియర్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలని నినదించారు. బతికుండగానే తమకు బకాయిలు ఇస్తే కొన్ని రోజులైనా సంతోషంగా గడుపుతామని కోరారు. తిరస్కరించిన పీఎఫ్ అప్లికేషన్లను సరిచేయకుండా యాజమాన్యం చోద్యం చూస్తుందని వారు మండిపడ్డారు. రిటైర్డ్ అయి అప్పులు తెచ్చి డీడీలు చెల్లించామని అయినా పెన్షన్ సాంక్షన్ కాలేదన్నారు.
2013, 2017కు సంబంధించిన వేతన సవరణ వివరాలను కూడా పీఎఫ్ కమిషనర్‌కు పంపకపోవడం వల్ల హైయ్యర్ పెన్షన్ పెరగాల్సింది ఆగిపోయిందన్నారు. డిసెంబర్ 2025 నుంచి మే 2026 వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయి ఉన్న గ్రాట్యుటీ, సెటిల్మెంట్ శాలరీ, ఇతర ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ బాధ్యులు లక్ష్మయ్య, సభ్యులు పి. చంద్రారెడ్డి, హమీద్, చెన్నయ్య, మనోహర్, జగదీశ్వరి దేవి, సునీత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరూ 60 ఏండ్ల పైబడిన వారు కావడంతో ఉపవాస దీక్ష సమయంలో చాలా మంది ఎండకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నేను 2022లో రిటైర్డ్ అయ్యాను. ఆర్టీసీ జీవితం చివరికి మమ్మల్ని రోడ్డుపాలు చేసింది. ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మాకు రావాల్సిన బకాయిల కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇంత ఎండలో ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఇక్కడికి చేరుకున్నాం. ఆర్టీసీలో డబ్బులు లేవని ఫైనాన్స్ అడ్వైజర్, ఈడీలు చెబుతున్నారు. ఉద్యోగులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలి. – రిటైర్డ్ ఉద్యోగి మనోహర్,
వరంగల్ డిపో
బకాయిల కోసం డిపోల ఎదుట, కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందించాం. రవాణా శాఖ మంత్రిని కలిశాం. గతంలో ఎండీ సజ్జనార్ 2026లో మార్చి వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అందలేదు. రిటైర్మెంట్ డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందామనుకున్న. మా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలి.
– టి.అంజయ్య, రైటైర్డ్ ఉద్యోగి
మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరితే తమ దగ్గర డబ్బుల్లేవని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ లాభాల బాట పట్టిందని చెబుతున్నారు. మరి మా డబ్బులు ఇవ్వొచ్చు కదా. మాకు ఈ వయసులో ఈ ఎండలో కష్టపడాల్సిన అవసరం ఎందుకు? మా పిల్లలకు మా కష్టార్జితం అందిద్దామనుకుంటే ఆ కలను ప్రభుత్వం నెరవేర్చకుండా చేస్తున్నది. ఇది చాలా మంది ఆవేదన. మా సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఆర్టీసీకే నష్టం.- జగదీశ్వరి దేవి, ఆర్టీసీ ఉద్యోగి
2023లో నేను రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడున్న అధికారులు ఏదో ఒక రోజు రిటైర్డ్ అవుతారు. మరి మా ఇబ్బందులు ఏంటో వారికి తెలియాలి కదా. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. అందుకే ఉపవాస దీక్షకు దిగాం. ఇప్పటికే సుమారు 300 మంది చనిపోయారు. అనేక మంది అనారోగ్యాలపాలవుతున్నారు. ఇప్పటికైన మా బకాయిలు చెల్లించాలి.
– సునీత, ఆర్టీసీ ఉద్యోగి
మేం పనిచేసిన దానికి రావాల్సిన పైసలనే అడుగుతున్నాం. ఈ యాజమాన్యానికి మా ఉసురు తగులుతుంది. కుటుంబాన్ని వదిలేసి ఉద్యోగాలు చేశాం. రిటైర్డ్ అయ్యాక ఇల్లు కట్టుకుందామనే ఆలోచనలు ఉంటాయి. ఎమ్మెల్యే, ఎంపీలకు పెన్షన్స్ ఆగుతున్నాయా? వారికి రావాల్సిన బెన్ఫిట్స్ అన్ని అందుతాయి. మా పరిస్థితి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోదు. జీవిత కాలం ఎండకు, వానకు టికెట్స్ చించుతూ ఉద్యోగాలు చేశాం. చేతులు, కాళ్లు నొప్పిపెట్టేవి. అవన్నీ భరిస్తే ఇప్పుడు మాకు అవమాన పరిస్థితి ఎదురైంది.
– లక్ష్మి, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి