Holi Festival | హైదరాబాద్ : హోలీ పండుగను పురస్కరించుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్( Cyberabad Police ) పరిధిలో పలు నిషేదాజ్ఞలు విధిస్తూ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర( CP Ravindra ) ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా తెలియని వారిపై రంగులు చల్లడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా రంగులు ఆడుతూ ఇతరులకు అసౌకర్యం కల్పించొద్దని సూచించారు.
ద్విచక్ర వాహనదారులపై బలవంతంగా రంగులు పోయడం నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ద్విచక్రవాహనాలపై గుంపులు గుంపులుగా వీధుల్లో తిరగడం, ఇతరులకు అసౌకర్యం కలిగేలా రంగులు చల్లుతూ అరవడం తదితర చర్యలపై కూడా నిషేధం విధించారు. ఈ ఆంక్షలు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.