హైదరాబాద్, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేట పెద్దచెరువులో ఆక్రమణలను అరికట్టేందుకు, భవిష్యత్లో ఆక్రమణలు జరుగకుండా ఉండేందుకు, కొత్త నిర్మాణాలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న ఆక్రమణల తొలగింపునకు తీసుకునే చర్యలను వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణలపై హైదరాబాద్కు చెందిన ఆకుల పద్మ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఎఫ్టీఎల్ ఏరియాలో చిన్నగా ప్రారంభించిన ఆక్రమణలను తర్వాత పెద్దవి చేస్తున్నారని సీనియర్ న్యాయవాది బి.రచనారెడ్డి చెప్పారు. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కందుకూరు ఆర్డీవో, బాలాపూర్ తాసీల్దార్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలైకి వాయిదా వేసింది.