సిటీబ్యూరో: రెస్టారెంట్ ఫుడ్ అంటేనే భయాభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు వస్తున్నాయి. బ్రాండెండ్ పేర్లతో జనాలను ఆకట్టుకుంటున్నా… రుచికరమైన ఆహారానికి బదులు.. పాచి, పురుగులు పట్టిన పదార్థాలతో జనాలకు వండి వారిస్తున్నారు. నగరంలోనే పేరున్న రెస్టారెంట్లు కూడా ఇదే తరహాలో కల్తీ, నాణ్యత లేని పదార్థాలతో ఆహారాన్ని వండి జనాల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నాయి. గతంలో నగరంలో ఉండే అధ్వాన రెస్టారెంట్ల బాగోతాలను వెలుగులోకి తీసుకొచ్చిన… ఫుడ్ సేఫ్టీ అధికారులు… తాజాగా నిర్వహించిన తనిఖీల్లోనూ కళ్లు బైర్లు కమ్మేలా..కంపు కొట్టే వాసనతో, పురుగులు పట్టిన పదార్థాలను చూసి.. వాంతులు చేసుకునే పరిస్థితి. ఇలా జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నగరంలోని రెస్టారెంట్లలో కేఎఫ్‌సీ, కృతుంగ, రెస్టో బార్ వంటి ఫేజ్ త్రీ హోటల్స్, బార్స్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉండటం గమనార్హం.
రుచి ఉండదు. శుచీ అసలే పాటించరు. కానీ పేరుకు మాత్రం లగ్జరీ హోటల్, ఫ్యామిలీ రెస్టారెంట్ అంటున్నా.. వంట గదులు చూస్తే..కడుపులో తిప్పడం ఖాయం. కాగా, గ్రేటర్లో ఇటీవల కాలంలో తనిఖీలు ముమ్మరం చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. తీరు మార్చుకోని హోటళ్ల నిర్వాహకులపై చర్యలకు దిగుతున్నారు.
సోమాజిగూడలోని కృతుంగ పాలేగార్స్ క్యూజన్, హెడ్ క్వార్టర్ రెస్టో బార్, కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రెస్టారెంట్లు, హోటళ్లలో వాడుతున్న నాణ్యత లేని, కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాలు, వస్తువులను గుర్తించారు. కృతుంగ రెస్టారెంట్లో ఎక్స్పైరీ డేట్, ఎఫ్ఎస్ఎస్ఐ గుర్తింపు లేని 6 కిలోల పన్నీరు, గడువు ముగిసిన ఆరు కిలోల మేతి మలాయి, నాన్ వెజ్ పేస్ట్, పురుగులు, కీటకాలు, ఎలుకలు, బల్లులు, చెత్తాచెదారం నిండిన వంట గదిని చూసిన అధికారులు విస్తుపోయారు. పేరుకు పెద్ద బార్గా గుర్తింపు పొందిన రెస్టో బార్‌లోనూ దొరికిన పిజ్జా బేస్‌లకు ఎలాంటి లేబుల్ లేదనీ, ఇక ఫ్రిజ్‌లో ఉంచిన ఆహార పదార్థాలను కూడా సరైన రీతిలో నిల్వ చేయలేదని గుర్తించారు. ఇలా ఈగలు, బొద్దింకలు, కుళ్లిన ఆహార పదార్థాలతో వంటకాలను చేసి నగరవాసుల ప్రాణాలతో రెస్టారెంట్లు చెలగాటమాడుతున్నాయి.