దుండిగల్, జూలై 6: కొంతమంది నాయకులు, రియాల్టర్లు తమ స్వార్థం కోసం హైడ్రాను తప్పుదోవ పట్టించి, కాలనీ ప్రహరీని కూల్చివేయించారని బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ అంటిలియా గేటెడ్ విల్లావాసులు ఆరోపించారు. గత నెల 24న హైడ్రా అధికారులు మల్లంపేట, బాచుపల్లి సరిహద్దులోని ఏపీఆర్ ప్రణవ్ అంటిలియా గేటెడ్ విల్లాలకు చెందిన ప్రహరీని ఏకపక్షంగా కూల్చివేసిన నేపథ్యంలో హైడ్రా తీరును నిరసిస్తూ ఆదివారం కాలనీవాసులు క్లబ్ హౌస్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువులు విల్లాల యజమానులు తమ ఆవేదనను వెల్లబోసుకున్నారు. మధ్యతరగతికి చెందిన సుమారు 650 కుటుంబాలు ప్రణవ్ అంటిలియా విల్లాలలో నివాసం ఉంటున్నారని తెలిపారు. పదేళ్ల కిందట హెచ్ఎండీఏ తమ కాలనీని గేటెడ్ కమ్యూనిటీగా గుర్తిస్తూ అనుమతులు ఇచ్చిందన్నారు. హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులను పరిగణలోకి తీసుకోకుండా, తమకు ఎంత మాత్రం సమాచారం ఇవ్వకుండా హైడ్రా అధికారులు సరిహద్దు గోడను ఏ విధంగా కూల్చివేస్తారన్నారు.
గోడ కూల్చివేత అనంతరం ఇదే విషయమై తాము అనేక సార్లు హైడ్రాధికారులను కలిసి వాస్తవాలను వివరించామన్నారు. జరిగిందేదో జరిగింది మేము కూల్చిన గోడస్థానంలో మీరు రేకులు అడ్డుగా కట్టుకోండి అంటూ సలహాలు ఇచ్చారే కానీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పర్యటించి అసలు విషయాలు తెలుసు కోవడం లేదన్నారు. వాస్తవానికి కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం ప్రణవ్ ఆంటీలియా నుంచి బాచుపల్లి ప్రధాన రహదారి అనుసంధానంగా 100 అడుగుల రహదారి ఉండేదని హైడ్రాను తప్పుదారి పట్టిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల రహదారి సర్వే నంబర్లు 41,42, 53,54 లలో ఉండగా తమ కాలనీ సర్వే నంబర్ 36, 37,38, 39,40 లలోని 45 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు.
అదేవిధంగా పక్కనే ఉన్న మల్లంపేటలో ట్రాఫిక్ రద్దీ అధికంగా పెరిగిందని, అక్కడి నుంచి వచ్చే ట్రాఫిక్‌ను తమ కాలనీ రోడ్ల మీదుగా పంపాలన్న కుట్రలో భాగంగానే కాలనీ ప్రహరీని కూల్చి వేయించారన్నారు. 2012 ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 8(కె) నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలు లేని సమయంలోనే ఇతర ప్లాట్ల నుంచి యాక్సిస్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ మల్లంపేట వాసులకు 100 ఫీట్ల పాత హైదరాబాద్ రోడ్డు ఉందని, దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా మల్లంపేట నుంచి బాచుపల్లి వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా వాటిని అడ్డుకుంటూ తమ కాలనీ మీదుగా రోడ్డు తీయాలని కొందరు నేతలు డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు.
ఇప్పటికైనా హైడ్రా అధికారులు, ప్రభుత్వం వాస్తవాలను గ్రహించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తమ కాలనీ ప్రహరీ కూల్చివేతపై హైడ్రా అధికారులు అధికారికంగా వివరణ ఇవ్వా లని, హైడ్రా చేపట్టబోయే తదుపరి చర్యలను నిలిపివేయాలని, ఈ విషయంలో పారదర్శక విచారణ చేపట్టాలని, తమ భద్రతకు భంగం వాటిల్లకుండా గౌరవంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కాలనీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఆంటీలియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గండికోట మహేశ్, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు వలివేటి నాగేశ్వరరావు, అధికారి బెల్లపు కొండ శ్రీనివాసరెడ్డి, జాయింట్ సెక్రెటరీ భార్గవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.