బంజారాహిల్స్, ఏప్రిల్ 30 : ఐదు రోజులుగా తమ బస్తీలో నీళ్లు రావడం లేదంటూ.. జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరానగర్ బస్తీవాసులు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను నిలదీశారు. గురువారం బస్తీలో పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ కారుకు బస్తీ మహిళలు అడ్డుగా నిలబడ్డారు.
తాగునీరు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచి కిందకు దిగిన ఎమ్మెల్యేపై మహిళలు ఫిర్యాదుల వర్షం కురిపించారు. రెండు నెలలుగా బస్తీలో తాగునీటి సమస్యలు ఉన్నప్పటికీ జలమండలి అధికారులు స్పందించడం లేదని వారు తెలిపారు. దీంతో జలమండలి జీఎం ప్రభాకర్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.