వ్యవసాయ యూనివర్సిటీ , ఫిబ్రవరి 22 : తెలంగాణ ప్రభుత్వ సహకారం, వర్సిటీ శాస్త్రవేత్తల కృషివల్లే రాష్ట్ర రైతాంగానికి అండగా ఉంటూ దేశ వ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించామని వ్యవసాయ శాఖ కార్యదర్శి, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉపకులపతి ఎం.రఘనందన్ రావు అన్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో నిర్వహించిన మూడవ పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు.
భూసారం పై కూడా తగిన పరిశోధన కార్యక్రమాలు రూపొందించి రైతులతో కలిసి మట్టి ఆరోగ్యాన్ని ఏవిధంగా కాపాడాలనే అంశంపై పరిశోధనలు చేయాలని సూచించారు. పెరిగిన సాగునీటి వనరులకు అనుగుణంగా వర్సిటీ శాస్త్రవేత్తల కృషి, శాస్త్ర సాంకేతిక ఫలితాల వల్ల నేడు రాష్ర్టానికి అవసరమైన తిండి గింజలను నిల్వ ఉంచుకొన్నామని తెలిపారు. తమిళనాడు, హర్యానా, మధ్యప్రదేశ్‌తో పాటు దేశ నలుమూలలకు మన వరి, మొక్కజొన్న, వేరుశనగ తదితర ధాన్యం ఎగుమతి అవుతుందని చెప్పారు.
సుస్థిర వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉన్నదని రిజిస్ట్రార్ డా.ఎస్.సుధీర్‌కుమార్ పేర్కొన్నారు. 2020-22 పరిశోధన, విస్తరణ కార్యక్రమాల నివేదికలను పరిశోధన సంచాలకులు డా. జగదీశ్వర్ , విస్తరణ సంచాలకులు డా. సుధారాణి వివరించారు. కార్యక్రమంలో పలువురు ఆదర్శ రైతులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు ప్రసంగించి తగిన సూచనలు, సలహాలు అందజేశారు. ఎలక్ట్రానిక్ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన త్రిడీ, వీ, డీలను ఉపకులపతి, ఇతర అధికారులతో కలిసి విడుదల చేశారు.