సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): పర్యావరణానికి ప్రాణ సంకటంగా మారుతున్న కర్బన ఉద్గారాలను శుద్ధ ఇంధన వనరులుగా తీర్చిదిద్దాలంటూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) వేదికగా జరిగిన జాతీయ స్థాయి మేథోమథన సదస్సుతో తొలి అడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా కాలుష్య కారకాలను సహజ సిద్ధమైన, పర్యావరణహితమైన ఇంధన వనరులుగా అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
ఇప్పటికే బీహెచ్ఈఎల్ వంటి సంస్థతో ఐఐసీటీ గాలిలో ఉండే కర్బన ఉద్గారాలతో స్వచ్ఛమైన ఇంధనాలను తయారు చేయడంపై కసరత్తు చేస్తోంది. దీని కోసం ఇరు సంస్థల మధ్య కీలక ఒప్పందం చేసుకుని కృషి చేయనున్నాయి. పెరుగుతున్న ఇంధన వనరుల వినియోగం నేపథ్యంలో, పర్యావరణానికి హాని చేయని ఇంధనాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆధునాతన సాంకేతికతను డెవలప్ చేయడంలో మూడ్రోజుల పాటు నిర్వహించిన మేథోమథన సదస్సు ఎంతోగానో తోడ్పడుతుందని ఐఐసీటీ వర్గాలు పేర్కొన్నాయి.
పీల్చే గాలి కలుషితమవుతున్న తరుణం..
పీల్చే గాలి కలుషితమైపోతున్న తరుణంలో వాతావరణంలోని కాలుష్య కారకాలను ఇంధన వనరులుగా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. స్వచ్ఛమైన ఆక్సిజన్ కంటే గాలిలో పరిమితికి మించి పోతున్న కర్బన ఉద్గారాల నిర్మూలన, నియంత్రణ, పునర్వినియోగం వంటివి అత్యంత కీలకంగా మారాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని వాతావరణంలో టన్నుల కొద్ది చేరుతున్న కర్బన ఉద్గారాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చేలా పరిశోధనలను విస్తృతం చేయడంలో ఐఐసీటీ కీలక పాత్రను పోషించింది. దేశంలోని కెమికల్ రంగ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి క్యాటలిస్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ సైస్టెనబిలిటీ(సీఈఈఎస్-24) ద్వారా మూడ్రోజుల సదస్సును ఇటీవల నిర్వహించారు. దాదాపు దేశంలోని 28 ప్రధాన పరిశోధన, ప్రముఖ విద్యా సంస్థలు, ఇంధన సంస్థలతో కలిసి ప్రత్యేక చర్చా వేదికను ఏర్పాటు చేసింది.