హైదరాబాద్ : నాంపల్లి అగ్రిప్రమాద ఘటనలో(Nampally fire incident) సహాయక చర్యలకు దట్టమైన పొగ ఆటంకంగా మారింది. భవనంలో చిక్కున్న ఆరుగురిని రక్షించేందుకు రెస్క్యూ టీంలు ప్రయత్నిస్తున్నాయి. సెల్లార్ అంతా ఫర్నీచర్ పరిచి ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతున్నది. ప్రమాద ఘటపై ఎస్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడింది. కాగా,హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది.
చిరాగ్అలీ లేన్‌లోని ఓ ఐదంతస్తుల భవనంలోని ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సెల్లార్లో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనావేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగిన విషయం తెసిందే. ఐదు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రమా దం జరగగా అక్కడినుంచి మంటలు పైన ఉన్న అన్ని అంతస్తులకు క్షణాల్లోన్నే వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురు భవనం సెల్లార్ లోపలే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. వీరిలో భవనం వాచ్మెన్ యాదయ్య పిల్లలు అఖిల్, ప్రణీత్, ఫర్నిచర్షాపులో పనిచేస్తున్న హబీబ్, ఇంతియాజ్, స్వీపర్ బేబి ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. ఇప్పటికీ వీరి ఆచూకీ తెలియలేదు. లోపల దట్టంగా పొగ ఉండటంతో లోపలకు వెళ్లడం కష్టమవుతున్నదని సహాయక బృందాలు చెప్పాయి. షాపు యజమాని సతీశ్ పోలీసులకు సమాచారమందించడంతోపాటు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో మొదట నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు. అప్పటికే ఘటనాస్థలానికి చేరుకున్న కలెక్టర్ హరిచందన, సీపీ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి సహాయకచర్యలు ముమ్మరం చేశారు.