సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణగా ఏర్పాటైన హైడ్రా యాక్షన్‌లో దూకుడు పెంచింది. ఇప్పటికే గడిచిన నెల రోజులుగా కబ్జా రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మూడు దశల్లో కార్యాచరణ రూపొందించుకుని ఇందుకు చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే చందానగర్ ఈర్ల చెరువు, నందగిరిహిల్స్, బహదూర్‌పుర, లోటస్‌పాండ్, గాజులరామారం తదితర ప్రాంతాల్లో ఆక్రమణలపై హైడ్రా కూల్చివేతలు జరిపింది.
ఈ మేరకు హైడ్రాకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఏర్పాటుతో పాటు సిబ్బంది నియామకంతో బలోపేతం చేయాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. దీంతో పోలీస్‌శాఖ నుంచి వివిధ పోస్టులకుగాను 259 మందిని డిప్యుటేషన్‌పై కేటాయిస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ 188 మంది, ఔట్సోర్సింగ్ పద్ధతిలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతో కలిసి దాదాపు 2,680 మందిని నియమించుకోనున్నారు.
జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)గా పేర్కొంటూ ప్రభుత్వం ఆ ప్రాంతం వరకు విపత్తు నిర్వహణ తదితర అధికారాలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ( హైడ్రా) పేరుతో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పార్కులు, లే అవుట్లు, ఖాళీ ప్రదేశాలు, ఆట స్థలాలు, చెరువులు, నాలాలు, భూ భాగాలు, రోడ్లు, క్యారేజ్‌వేలు, ఫుట్‌పాత్‌లు తదితరమైన వాటిని కబ్జాల నుంచి పరిరక్షించడం హైడ్రా విధులుగా పేర్కొంటూ గత నెల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగానే ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, చెరువుల కబ్జాలను నియంత్రించడం, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ గడిచిన కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటించి చెరువులు, పార్కుల అక్రమార్కులపై చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు హైడ్రాను మరింత బలోపేతం చేస్తున్నారు.